తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది.
కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు. ఆ పార్టీలో ఉన్న వారిని ఎలా బయటకు లాగుదామా అని ఆలోచిస్తున్నారట.
కోవర్టులు కొంపముంచుతున్నారా?
ఉన్న వాళ్లు బయటకు రావడానికైనా... వేరే పార్టీ వాళ్లు బీజేపీలోకి వెళ్లకపోవడానికైనా చెప్పే ఒకే ఒక కారణం కోవర్ట్. అదే కేసీఆర్ మనుషులు బీజేపీలో ఉన్నారని అక్కడ జరిగే పరిణామాలు, చేరికలు, ఇతర సమాచారాన్ని బీఆర్‌ఎస్‌కు ఉప్పు అందిస్తున్నారని ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నమాట.
బాంబు పేల్చిన నందీశ్వర్ గౌడ్
ఇప్పటి వరకు ఈ ఆరోపణలు వేరే పార్టీలో ఉండే వాళ్లు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేతలు వీటిని సమర్థిస్తున్నారు. తాజాగా బిజేపి నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణా బిజేపిలో కేసిఆర్ కోవర్టులున్నారని తేల్చి చెప్పేశారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లోని కీలక విషయాలు నేరుగా కేసిఆర్‌కు చేరవేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కేసిఆర్‌కు నమ్మిన బంటులుగా ఉంటూ బిజేపికి చేటు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలంగాణ బిజేపిలో ఉన్న కేసిఆర్ కోవర్టుల పేర్లు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు నందీశ్వర్ గౌడ్. కాబట్టే కోవర్టులపై అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసానంటున్నారు. తెలంగాణ బిజేపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌కు కోవర్టు పేర్లు చెప్పడంతోపాటు ఆధారాలను సమర్పించానని తెలిపారు. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి పేర్లు సైతం వెల్లడిస్తానని తెలిపారు.
ఆ నలుగురు ఎవరు?
తెలంగాణలో బిజేపికి లక్షల మందికిపైగా కమిటెడ్ కార్యకర్తలున్నారని, వారిని గందరగోళ పరిచేలా ఓ నలుగురు నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నందీశ్వర్ గౌడ్. పార్టీకి నష్టం చేసేలా ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. త్వరలో బిజేపిలోని కేసిఆర్ కోవర్టుల పేర్లు మీడియా ముఖంగా వెల్లడిస్తానని తెలిపారు నందీశ్వర్ గౌడ్.
ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ బిజేపిలోకి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన సీనియర్లు సైతం ఇప్పుడు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి ఇలా చెప్పుకుంటూ పోతే మరికొందరు బయటపడుతున్నారు. తెలంగాణాలో బిజెపి సత్తా చూపిస్తాం వచ్చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పివారు సైలెంట్ అయిపోయారు.
ఆకర్ష్ ఫెయిల్
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీ నేతలకు గాలం వేసేందుక ఏర్పాటు చేసిన చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల సైతం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి, జూపల్లి వంటి కీలకనేతలను బిజేపిలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతే కాదు వారిని ఆహ్వానించడానికి వెళ్లిన ఈటెలను, నువ్వే కాంగ్రెస్‌లోకి వచ్చేయమంటూ ఒప్పించే ప్రయత్నం చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరికొందరు పక్కచూపులు
ఇలా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తామంటూ ఏర్పడ్డ బీజేపీ వలసల కమిటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటూనే ఉన్నాయి. ఈటెలకు వ్యతిరేకంగా బండి టీమ్ పని చేస్తుందనే విమర్శలు ఓవైపు. పార్టీలో ఉండాలా పొంగులేటి చెప్పినట్లు గోడ దూకేద్దామా అనే సందేహం ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం బీజేపితో అంటిముట్టనట్లు వ్యవహరించడం అనేక సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఏదోరోజు ఆయన జారుకుంటారా అనే వార్తులు చక్కర్లు కొడుతున్నాయి.
శాంతంగా లేరా?
వీరి తీరు ఇలా ఉంటే విజయశాంతి సైతం బిజెపిలో ఇదివరకు ప్రదర్మించిన జోష్ తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఓ వైపు తెలంగాణలో కీలక నేతలను తమ పార్టీలోకి లాగుతూ బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్ వేగంగా అడుగులువేస్తుంటే, కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజేపి మాత్రం తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలతో అయోమయంలో పడింది.
కాంగ్రెస్‌లో విభేదాలు లేవా అని కాదు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎన్ని ఉన్నా తెలంగాణాలో కీలక నేతలను ఆకర్షించడంలో కాంగ్రెస్ ఓ నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని చెప్పవచ్చు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై బిజేపి కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృగా ఉన్నట్లు తెలుస్తోంది.