భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ఎంతో మంది ఈ దాడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు చేశారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి సంబంధించి అంతా మారిపోయిందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా మారిపోయిందని, ఎక్కువ మంది ప్రజలు మాట్లాడడానికి వీలు లేకుండా ఉన్నారని రాహుల్‌ దుయ్యబట్టారు. నార్వేలోని ఓస్లో యూనివర్సిటీలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


'భారత్‌ గురించి ఆలోచించేప్పుడు మొదట గ్రహించాల్సిన విషయం ఏంటంటే 2014 వరకు ప్రజాస్వామ్య భారత దేశంలో రాజకీయ పార్టీలు ఒక దానితో ఒకటి పోటీ పడుతూ ఉండేవి. ఇతర సంస్థలు తటస్థంగా ఉండేవి. మీడియా అందరికీ అందుబాటులో ఉండేది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేవి. ఆర్థిక వనరులు నిబంధనలకనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడులు జరుగుతున్నాయి. దీనికోసం చాలా మంది పోరాడుతున్నారు' అని రాహుల్‌ పేర్కొన్నారు.   ఓస్లో మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.


పోరాటం ఆగిపోతే ఒక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. అయితే ఇంకా ఎంతో ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, పోరాటం ముగియలేదు, మేము గెలుస్తామని భావిస్తున్నాం అని ఆయన తెలిపారు. భారత్‌లోని పలు సంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం చూపిస్తోందని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వంటి ఏజెన్సీలు ఆయుధాలుగా చేస్తున్నారని దుయ్యబట్టారు.  


బీజేపీ సిద్ధాంతాలను ఎదురించే వారిని టార్గెట్‌ చేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. మేము కేవలం సాధారణ రాజకీయ పార్టీలతో పోటీ పడడం లేదని, భారత నిర్మాణం కోసం పోరాడుతున్నామని అన్నారు. ఇంటర్వ్యూలు, చర్చలు కూడా ఇకమీదట సాధ్యంకాకపోవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలను మాట్లాడనీయడం లేదని తను గతంలో చెప్పిన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నానని అన్నారు. ఎక్కడైతే మీరు మాట్లాడడానిని అనుమతి లభించదో, మీ భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం లేదో అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజస్వామ్యం బలహీనపడిందని పేర్కొన్నారు.


భారత్‌ జోడో యాత్రలో భాగంగా తాను 4000 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధమయ్యాయని, ఎందుకంటే ప్రజలను చేరుకోవడానికి అంత కంటే అవకాశం లేదని ఆయన తెలిపారు. చాలా మంది ఎందుకు ఇన్ని కిలోమీటర్లు నడవడం అని అడిగారు. కానీ నాకు అంతకు మించి మరో అవకాశం లేదని చెప్పాను అని అన్నారు. అదే 2005 లేదా 2012లో ఇలా పాదయాత్ర చేయమని అడిగితే.. నో వే అని చెప్పి ఉండేవాడినేమో. కానీ ఇప్పుడు పాదయాత్ర రాజకీయ అవసరంగా మారింది అని రాహుల్‌ వెల్లడించారు. ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నప్పుడు ప్రజలను చేరుకోవడానికి నడకనే సరైన మార్గమని అనుకున్నట్లు తెలిపారు. భౌతికంగా వెళ్లి ప్రజలను కలవడమే ప్రతిపక్షాలు మిగిలిన ఏకైక మార్గమని రాహుల్‌ పేర్కొన్నారు. 


భారత్‌లో నిర్దిష్ట భావజాలం ఉండడాన్ని తాను సమర్థిస్తానని, అయితే అది మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధ, గురునానక్‌ భావజాలం అని రాహుల్‌ తెలిపారు. తాను దానికోసమే పోరాడుతున్నానని, తాను నాయకుడిని అవుతానా, కాదా అనేది తర్వాత విషయమని అన్నారు. భారతదేశ భవిష్యత్తు కోసం సైద్ధాంతిక పోరాటం జరుగుతోందని, మన స్థానాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని అదే తాను చేస్తున్నానని చెప్పారు.