పేదలకు సొంత ఇల్లు ఒక కల. ఆ కల నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారు. పేదల సొంతిటి కల నిజమై.. వారు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటిని దశల వారీగా పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపే ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నారు. 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు 11వేల 700 గృహాలను అందజేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా... పావులు కదువుతోంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో జోరు పెంచి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. హాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా... డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో రేపు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తోంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఇందు కోసం అన్‌లైన్ ద్వారా డ్రా నిర్వహించి 12వేల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రా నిర్వహించారు. రేపు మొదటి విడత ఇళ్ల పంపిణీ జరగనుంది. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో... ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున 12 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల దగ్గరే రేపు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, యూసుఫ్‌గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరగనుంది. ఏడుగురు మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, మేయర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా కేటాయిస్తారు. బహదూర్‌పల్లిలో జరిగే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ 1700 మందికి ఇళ్లు పంపిణీ చేస్తారు. ఇక, పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు 3వే 300 మందికి ఇళ్లు పంపిణీ చేయనున్నారు. శేరిలింగంపల్లిలోని నల్లగండ్లలో నిర్మించిన 216 ఇళ్లను, హఫీజ్‌పేట్‌లోని 168 ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పంపిణీ చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని ఇళ్లను శేరిలింగంపల్లి పరిధిలోని లబ్ధిదారులకు అందజేయనున్నారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలు, బహదూర్‌పురలోని ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాలను మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు. బండ్లగూడ పరిధిలో నిర్మించిన ఇళ్లను... చాంద్రాయణగుట్ట పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేయనుండగా... ఫారూక్‌నగర్‌లో నిర్మించిన ఇళ్లను బహదూర్‌పురకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పటాన్‌చెరులోని కొల్లూరు, అమీన్‌పూర్‌లో నిర్మించిన 3వేల 300 గృహాలను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరులోని 1500 ఇళ్లను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, శేరిలింగంపల్లికి చెందిన 156 మంది, రాజేంద్రనగర్‌కు చెందిన 144 మంది, పటాన్‌చెరుకు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అలాగే.. అమీన్‌పూర్‌లో నిర్మించిన 1800 ఇళ్లను గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది, కార్వాన్‌కు చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు. మేడ్చల్‌లోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1500 ఇళ్లను మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన లబ్దిదారులను పంపిణీ చేస్తారు. రాజేంద్రనగర్‌లో నిర్మించిన 356 డబుల్ ఇళ్లను, నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇళ్లను రాజేంద్రనగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఉప్పల్ పరిధిలో నిర్మించిన 500 గృహాలను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పంపిణీ చేయనున్నారు. ఈ ఇళ్లను ఉప్పల్ నియోజకవర్గ లబ్ధిదారులకే అందజేయనున్నారు. మేడ్చల్ పరిధిలోని ప్రతాపసింగారంలో నిర్మించిన వెయ్యి ఇళ్లను.. ఎల్బీనగర్, అంబర్‌పేటకు చెందిన లబ్ధిదారులకు అందజేస్తారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బహిరంగ మార్కెట్ విలువ 30 నుంచి 40లక్షల రూపాయల వరకు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లను నిరుపేదలకు అందించగా నిర్మాణాలు పూర్తయిన దాదాపు 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్‌లో పంపిణీ చేస్తోంది. ఇళ్లు అందుకోబోతున్న బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, యూసుఫ్‌గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట ప్రాంతాల లబ్ధిదారులు.. సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.