లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలో విచారణ జరుగుతుండగానే భారీగా పోస్టర్లు వెలిశాయి. బైబై మోడీ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో కనిపించిన ఈ పోస్టర్లపై చాలా బీజేపీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కమలం కండువా కప్పుకుంటే చాలా కేసులు మాఫీ అంటూ వాషింగ్ పౌడర్ వేసి అంతక ముందు ఆ తర్వాత అనేది సూచిస్తూ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఈ మధ్య కాలంలో సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. ఏదైనా మెయిన్ ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని సమర్థిస్తూనో వ్యతిరేకిస్తూనో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు, ఫెక్సీలు వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి పోస్టర్లు ఢిల్లీలో కూడా ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఈడీ విచారించనుంది. ఈటైంలో ఆమెకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. అదే టైంలో బీజేపీని విమర్శిస్తూ దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతూ ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది అనే విమర్శలతో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. బీఆర్ఎస్ మద్దతుదారులే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని స్పష్టం అవుతుంది కానీ ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు.
ప్రత్యర్థులను ఎలిమినేట్ చేయడానికో, అణచివేసేందుకు మాత్రమే ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్న ఆరోపణలతో పోస్టర్లు వేశారు. ఇందులో కవితకు మద్దతుగా కూడా కొటేషన్లు ఉన్నాయి. అదే టైంలో కేసులు ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరితే ఎలాంటి కేసులు ఉండబోవన్న విషయాన్ని కూడా పోస్టర్లలో చెప్పారు.
గత కొన్నేళ్లుగా బీజేపీలో చేరిన వారి పేర్లు ఫొటోలను అందులో చెబుతూ చేరక ముందు ఉన్న కేసులు చేరిన తర్వాత వాళ్ల కేసుల స్టేటస్‌ను ఈ పోస్టర్లలో వివరించారు. జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజపీ ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీ ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఇలా కేసుల్లో నిండా మునిగిన వాళ్లు కూడా రైడ్ జరిగిన తర్వాత బీజేపీలో చేరి కేసుల నుంచి తప్పించుకున్నారనే విమర్శ వచ్చేలా పోస్టర్లు వేశారు.
మధ్యలో రైడ్ అనే వాషింగ్ పౌడర్ వేసి వ్యంగ్యంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. వాళ్లంతా ముందు బురద మరకలతో ఉన్నప్పుడు రైడ్ జరుగుతుందని వెటంనే వాళ్లంతా కాషాయం దుస్తుల్లోకి మారిపోతున్నట్టు అందులో వివరించారు.
కవిత ఫొటో కూడా పోస్టర్‌లో వేశారు. తెలంగాణ నుంచి కవిత రైడ్ జరగక ముందు జరిగిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నారని ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. ట్రూ కలర్ నెవర్ ఫేడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. నిజమైన రంగు ఎప్పటికీ వెలిసిపోదని చెప్పారు. చివరకు బైబై మోడీ అంటూ హ్యాగ్ ట్యాగ్ జత చేశారు.
గతంలో కూడా హైదరాబాద్‌లో ఇలాంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. మొన్నీ మధ్య కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని వ్యంగ్యంగా చెబుతూ తెలంగాణకు వచ్చింది జీరో అంటూ వివరించేందుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అంతకు ముందు ఓసారి మోడీ వచ్చిన సందర్భంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా నగరంలో భారీగా హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది టీఆర్‌ఎస్. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కూడా నిన్ను నమ్మలేం దొరా అంటూ కేసీఆర్‌ను తప్పుపడుతూ ఫ్లెక్సీలు వేయింంచారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో తమ విధానాలు చెప్పకోవడానికి బదులు ఇతరులపై విర్శలు చేయడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు ట్రెండుగా మారింది.