Kavitha Party Brs Problems:  దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు నిలువునా చీలిపోయింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సాక్షిగా కవిత తన తండ్రి స్థాపించిన పాత పేరును తలపించేలా  టీఆర్ఎస్  పార్టీని ప్రకటించడం బీఆర్ఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా తన సస్పెన్షన్‌కు కారణమైన హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె బహిరంగంగానే యుద్ధం ప్రకటించడం, కేసీఆర్ రిని కొందరు వ్యక్తులు బందీగా చేసుకున్నారని ఆరోపించడం పార్టీలో ముదిరిన అంతర్గత విభేదాలను అద్దం పడుతోంది. ఇప్పుడు కవితను అడ్డుకుంటే ఆమెకు సానుభూతి పెరుగుతుందని, పట్టించుకోకపోతే పార్టీ ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

Continues below advertisement

 వారసత్వ పోరాటమా.. అస్తిత్వ పోరాటమా? 

కవిత తన పార్టీకి  తెలంగాణ రాష్ట్ర సేన  అని పేరు పెట్టడం వెనుక బలమైన వ్యూహం ఉంది. కేసీఆర్  బీఆర్ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణ ఆత్మను కోల్పోయారని, తాను తిరిగి ఆ మూలాలను తెస్తానని ఆమె వాదిస్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అనే పోరు మొదలైతే, ఇది కేవలం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వారసుల మధ్య తగాదాగా మారిపోయే ప్రమాదం ఉంది.   కుటుంబ వివాదాలే చర్చనీయాంశమైతే రెండు పార్టీలూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నేతల వలసలు - బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి 

Continues below advertisement

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల, అసంతృప్త నేతలకు ఆమె ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత దక్కని వారు, ముఖ్యంగా హరీష్ రావు ,  కేటీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడని వారు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఆమెపై దూకుడుగా వెళ్తే, ఆమె దానిని  మహిళా నేతపై దాడి గా చిత్రీకరించి మరింత మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తారు. అలాగని మౌనంగా ఉంటే, కవిత తన కేడర్‌ను చీల్చుకుపోతారనే భయం గులాబీ బాసులను వేధిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు  ముందు నుయ్యి - వెనుక గొయ్యి 

సాధారణంగా కేసీఆర్   పట్ల అపారమైన గౌరవం చూపే కవిత, ఒక్కసారిగా తండ్రి నిర్ణయాలను ప్రశ్నించడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మద్యం కేసులో తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ అండగా నిలబడలేదని, పైగా కుటుంబంలోని కొందరు సభ్యులే తనను కావాలని ఇరికించారని ఆమె బలంగా నమ్ముతున్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. కేసీఆర్   కేటీఆర్‌ను తన వారసుడిగా ఖరారు చేయడం కూడా కవిత అసంతృప్తికి మరో కారణం కావచ్చని సమాచారం. ఈ వారసత్వ పోరు ఇప్పుడు తెలంగాణ నడిబొడ్డున కొత్త పార్టీ రూపంలో ప్రత్యక్షమైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు  ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పరిస్థితి. కవిత పార్టీని గుర్తిస్తే తమ ఉనికికే ప్రమాదమని, విమర్శిస్తే కుటుంబ గొడవలు రచ్చకెక్కుతాయని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్‌ను కవిత దక్కించుకోవడమే ఆమెకు పెద్ద విజయం కాగా, దానిని ఎలా అడ్డుకోవాలో తెలియక బీఆర్ఎస్ నాయకత్వం సతమతమవుతోంది. రానున్న రోజుల్లో ఈ  వారసత్వ యుద్ధం  తెలంగాణ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.