వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల పంపకంలో మొదట పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని భావించిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వారం రోజుల్లోనే కీలకమైన బాధ్యతలు పొందారు. కేవలం పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్‌ పదవి మాత్రమే ఆయనకు గతంలో దక్కింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలోనూ కీలక పదవులు పొందారు. జిల్లాల అధ్యక్షులు..  కోఆర్డినేటర్లందరూ ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. సజ్జల బాధ్యతలన్నీ విజయసాయిరెడ్డికి లభించాయి. సజ్జలకు కేవలం .. ఎమ్మెల్యేలు, మీడియా వ్యవహారాల విధులు మాత్రమే కేటాయించారు. ఈ వారంలో ఏం జరిగిందోనని వైఎస్ఆర్‌సీపీలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. 


2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డినే ఉండేవారు. పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ప్రశాంత్ కిషోర్ టీంతో సమన్వయం చేసుకుంటూ...  పార్టీలో చేరికల్ని.. పార్టీ యంత్రాగానికి ఎన్నికలకు ఎదర్కొనేందుకు పూర్తి స్థాయి సహకారాన్ని ఆయన అందించారు. ఎన్నికలు అయిపోయి వైఎస్ఆర్‌సీపీ విజయం తర్వాత ఆయన ఉత్తరాంధ్రకు పరిమితయ్యారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే సోషల్ మీడియా పోస్టింగ్‌ల వల్ల అనేక సమస్యలు పార్టీకి వచ్చాయి అదే సమయంలో ఉత్తరాంధ్రలో పరిస్థితులు కూడా కలసి రాకపోవడంతో విజయసాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. మెల్లగా ఆయనను దూరం పెడుతున్నారని వైఎస్ఆర్‌సీపీలోనే చెప్పుకున్నారు.  


ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీఎం జగన్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి బాగా దగ్గరయ్యారు. ఆయనకు ప్రభుత్వ,  పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయి పట్టు చిక్కిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలోనూ ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అంశంలోనూ ఆయన కీలకంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ పదవుల పంపకం జరిగింది. ఈ పదవులను అత్యంత కీలకంగా భావించారు. రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధం కావడానికి ఈపదవులు కీలకం. ఈ పదవుల్లోనూ సజ్జలదే పైచేయి అయింది. దీంతో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారన్న ప్రచారం ఊపందుకుంది. 


అయితే అనూహ్యంగా వారంరోజుల్లోనే పరిస్థఇతిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు విజయసాయిరెడ్డి. జగన్‌తో నేరుగా చర్చించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోవడం వల్ల వచ్చేసమస్యలను వివరించారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల.. పార్టీ వ్యవహారాలపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని వివరించి... ఆ బాధ్యతలు తనకు దక్కేలా చూసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గలేదని.. పట్టు బట్టి సాధించుకున్నారని వైఎస్ఆర్‌సీపీలోని ఆయన మద్దతు దారులు సంతృప్తిగా ఉన్నారు.