హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఆధిపత్య పోరాటాన్ని మరో స్టేజ్‌కుతీసుకు వెళ్తున్నారు. మొన్నటి వరకూ నాలుగు గ్రూపులు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకోగా.. ఇప్పుడు మూడు గ్రూపులు ఏకమై మరో గ్రూప్‌పై పోరాటం ప్రారంభించాయి. వైఎస్ఆర్‌సీపీలో హిందూపురం నేతల కథ కీలక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిచింది. ఆయన వ్యక్తిగత పర్యటన కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని చూసుకోవాల్సిందిగా ఆయన ఎంపీ మాధవ్‌కు అప్పజెప్పారు. దీంతో  మిగిలిన నేతలు అవమానం ఫీలయ్యారు. 
  
మొన్నటి వరకు ఎంపీ మాధవ్ ను హిందూపూర్ వైపు తిరిగి చూడనివ్వకుండా చేసి ..తీరా విదేశాలకు వెళుతున్నప్పుడు మాత్రం పగ్గాలు మాధవ్ కు అప్పజెప్పడం ఏంటని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు.  గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించే సత్తా తమకు కూడా ఉందంటున్నారు. హిందూపురం వైఎస్ఆర్‌సీపీకి   మాజీ సమన్వయకర్తలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ గని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఇక్బాల్... తమ ముగ్గురిలో ఎవరినీ కాదని మళ్లీ ఎంపీని తెచ్చి పెట్టడంతో ముగ్గురు నేతలూ  విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చారు. 


ఎమ్మెల్సీ ఇక్బాల్ మాజీ పోలీస్ అధికారి.. ఎంపీ మాధవ్ కూడా సీఐగా పని చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని  ఈ పోలీసు బాసులు మాకు వద్దు.. ఇన్చార్జిలుగా మా హిందూ పురానికి చెందిన స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ లోకల్ సెంటిమెంట్ ను  వినిపించడం ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైసిపి నాయకులు అందరూ బెంగళూరు సమీపంలోని ని దేవనహళ్లి లో ప్రైవేట్ రిసార్టులో రహస్య సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.  


హిందూపురం లోని బాల యేసు విద్యా సంస్థలో సమావేశం నిర్వహించి రెండు రోజుల్లో బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి.  ఎమ్మెల్సీ ఇక్బాల్ , ఎంపీ గోరంట్ల మాధవ్ నాయకత్వం మాకు వద్దంటూ తెగేసి చెబుతున్నారు.  దీంతో ఇప్పటికే  చీలికలు పీలికలు గా ఉన్న వైసిపి కి హిందూపురంలో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.  గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ వస్తే ఎవరు హాజరు కాకుండా నిర్ణయం తీసుకున్నారు.