BJP Sabha : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ శనివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు బీజేపీకి మార్గం సుగమం అయింది. సభను నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాలనుకున్న సభకు ముందుగా పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఉన్న పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌లో ఇంటి వద్ద దింపారు. ఆ తర్వాత పాదయాత్ర నిలిపివేయాలని ఆదేశించారు. అయితే హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ బహిరంగసభకు ఇచ్చిన అనుమతిని పోలీసులు ర్దదు చేశారు. దీంతో బీజేపీ నేతలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 


బీజేపీ సభకు అనుమతి ఇస్తూ హైకోర్టు నిర్ణయం 
 
ఈ నెల 27న   స‌భ ఉన్న నేప‌థ్యంలో త‌మ పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించాల‌న్న బీజేపీ అభ్య‌ర్థ‌న మేర‌కు హైకోర్టు శుక్ర‌వారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ కాలేజీ గ్రౌండ్‌కు ఒకే ప్ర‌వేశ ద్వారం ఉంద‌ని, ఇలాంటి ప్ర‌దేశంలో భారీ బ‌హిరంగ స‌భ‌కు అనుమ‌తి ఇస్తే ప్ర‌మాద‌మ‌ని, అంతేకాకుండా క‌ళాశాల‌లో రాజకీయ పార్టీల స‌భ‌ల‌కు అనుమ‌తి మంచిది కాద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ తెలిపారు.  అయితే హ‌న్మ‌కొండ క‌ళాశాల‌లో స‌భ ఏర్పాటు చేస్తున్న వాళ్లం తామే తొలి వాళ్లం కాద‌ని, చాలా పార్టీల వాళ్లు చాలా సార్లు అక్క‌డే స‌భలు, స‌మావేశాలు నిర్వ‌హించుకున్నార‌ని బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ఇరువర్గాల వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు రేపటి వ‌రంగ‌ల్ బీజేపీ స‌భకు అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ స‌భ‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. 


హైకోర్టు తీర్పు రాక ముందే వరంగల్‌లో 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు


ఇప్పటికే  వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 – సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోలీసు ఆంక్షలు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయని సీపీ స్పష్టం చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బీజేపీ హైకోర్టు నుంచి సభకు పర్మిషన్ తెచ్చుకున్న సమయంలో  పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది.  


శనివారం బీజేపీ సభ సజావుగా సాగుతుందా ? 


ఓ వైపు పోలీసుల ఆంక్షలు.. మరో వైపు బీజేపీ సభను సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో వరంగల్‌లో శనివారం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రారంభమయింది. హైకోర్టు అనుమతి ఇచ్చినందున పోలీసులు తప్పని సరిగా సహకరించాల్సి ఉంటుంది.