ప్రతిపక్షం రాని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగు రాష్ట్ర రాజకీయాలనే హీట్‌పుట్టించే డిబేట్ ఒకటి జరిగింది. అధి కూడా టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాలుష్య నియంత్రణపై బొండా ఉమా చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తిప్పి కొట్టారు. కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తోంది.
కాలుష్య నియంత్రణ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న పీ కృష్ణయ్య పని తీరుపై విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల లెటర్స్‌ను కూడా తిరస్కరిస్తున్నారు. సమస్య ఉందని చెబితే చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరిదిద్దాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరిద్దామంటే ఇద్దరూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు.
బొండా ఉమా కామెంట్స్‌ను పవన్ కల్యాణ్ ఖండించారు. కృష్ణయ్య పని తీరును ప్రశంసించారు. తాను అందుబాటులో ఉండటం లేదన్నది వాస్తవం కాదని సభకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరి చేసుకోవాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉంటాయని కానీ కృష్ణయ్య ఛైర్మన్ అయ్యాకే పరిస్థితిలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. నేరుగా ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ వాగ్వాదం జరుగుతున్న టైంలోనే కృష్ణయ్య కూడా అసెంబ్లీ గ్యాలరీలోనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్లాస్టిక్ కాలుష్యం అనే అంశంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి ఓ ప్రశ్న అడిగారు. దీనికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం చెబుతూ అసెంబ్లీ, సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామన్నారు. లక్షల మంది భక్తులు వచ్చే తిరుమలలో ప్లాస్టిక్ నియంత్రణకు సహకరిస్తున్నారని తెలిపారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ తినేసి అక్కడే పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి చోటా ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, చివరకు తల్లి పాలకు సైతం కాలుష్యం కాటు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు చేసి సర్క్యులర్ ఎకానమీ సృష్టిస్తామని పవన్ వివరించారు. జిల్లా స్థాయిలో ప్లాస్టిక్ నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు అవుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టోతున్నట్టు పేర్కొన్నారు. ఇది కేవలం ప్రభుత్వమో, ప్రభుత్వ ఉద్యోగులో చేస్తే సరిపోదని ప్రజలు కూడా భాగం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగానే బొండా ఉమా కామెంట్స్‌ను ఖండించారు. తాను కానీ, కృష్ణయ్య కాని అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. పొలూష్యన్ కంట్రోల్ పేరుతో పరిశ్రమలను భయపెట్టే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అలా చేస్తే ఒక్క పరిశ్రమ కూడా ఉండబోదని అభిప్రాయపడ్డారు. అదే చేస్తే గత ప్రభుత్వానికి కూటమి సర్కారుకు తేడా ఏంటని ప్రశ్నించారు.
ఒక్క రాంకీ లాంటి పరిశ్రమపై చర్యలు తీసుకుంటే సరిపోదన్నారు. ఇలాంటివి యాభైకిపైగా పరిశ్రమలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించగలమని అదే చేస్తున్నామని వివరించారు. ఈ టైంలోనే మీరు ఒక్క పిలుపు ఇస్తే జనసైనికులు కాలుష్యంపై ఉద్యమం చేస్తారని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో గుంతలు పూడ్చినట్టుగా కాలుష్యం లేకుండా చేస్తారని ఉదహరించారు.
బొండా ఉమా, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన డిబేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇది కూటమిపై ప్రభావం పడుతుందా అన్న కోణంలో సీఎంవో ఆరా తీస్తోంది.