Three YSRCP MLCs to join TDP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ముగ్గురు నేతలు టీడీపీ కండువా కప్పించుకోనున్నారు. వైసీపీలోని పదవులు, ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు సమర్పించారు. కానీ మండలి చైర్మన్ ఇంకా వీరి రాజీనామాలను ఆమోదించలేదు.
నెల్లూరు జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గోదావరి జిల్లాలు చెందిన కర్రి పద్మశ్రీ, గుంటూరుకు చెందిన మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత, పార్టీ అంతర్గత సమస్యలు, నాయకత్వంపై అసంతృప్తి కారణంగా టీడీపీలో చేరాలని నిర్ణయించారు. వీరు కొన్నాళ్ల కిందటే..ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ మోషన్ రాజు వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీనే. ఆయన రాజీనామాలను ఆమోదించడం లేదు. కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు ఆలస్యం చేస్తున్నారని మండలి చైర్మన్ కు రూ. పదివేల ఫైన్ కూడా వేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
బల్లి కల్యాణచక్రవర్తి.. 2019లో తిరుపతి నుంచి వైసీపీ తరపున లోక్ సభ కు ఎన్నికైన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు. ఎంపీగా ఉన్న ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమారుడు కల్యాణచక్రవర్తి ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికీ.. జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చి.. గురుమూర్తికి టిక్కెట్ కేటాయించారు. తర్వాత కల్యాణచక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ చిలుకలూరిపేట నేత. విడదల రజనీ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవి ఇవ్వకపోగా.. విడదల రజనీని మళ్లీ ఇంచార్జ్ గా చేయడంతో సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. కర్రి పద్మశ్రీ కూడా .. టీడీపీలో చేరనున్నారు.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలియగానే మండలి చైర్మన్ రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసేవారు. అయితే ఇప్పుడు రాజీనామాలు సమర్పించి నెలలు గడుస్తున్నా నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న సంఖ్యాబలం ప్రకారం.. ఎవరు రాజీనామా చేసినా ఆ సీటు కూటమి ఖాతాలోనే పడుతుంది. అందుకే రాజీనామాలు ఆమోదించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన వాళ్లు.. మళ్లీ తమ సీటు తమకే ఇస్తారన్న ఒప్పందంతోనే పార్టీలు మారుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఇలా రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన వారిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కూడా ఉన్నారు. చీరాలకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. కైకలూరుకు చెందిన మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. జనసేనపార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు.