Simple Energy Rare Earth-Free Motor Innovation: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ "సింపుల్ ఎనర్జీ", ఆటోమొబైల్‌ రంగంలో చరిత్ర సృష్టించింది & కొత్త సంచలనానికి కారణమైంది. రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (అరుదైన భూమి మూలకాలు) ఉపయోగించకుండా, దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును ఈ EV కంపెనీ అభివృద్ధి చేసింది. దీని అర్థం.. EV మోటారు రూపకల్పన కోసం చైనా నుంచి దిగుమతి చేసుకునే అరుదైన లోహాలు అవసరం ఇకపై ఉండదు. కొన్ని నెలల క్రితం, చైనా భారతదేశానికి అరుదైన భూమి మూలకాల సరఫరాను నిలిపివేసింది, ఇది భారతీయ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అయితే, సింపుల్ ఎనర్జీ ఈ సవాలును అవకాశంగా మార్చుకుంది, అరుదైన భూమి మూలకాలు లేని మోటారు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ ఆటో కంపెనీగా అవతరించింది.

Continues below advertisement

అరుదైన భూమి మూలకాలు అంటే ఏంటి, అవి ఎందుకు ముఖ్యం?నియోడైమియం, డైస్ప్రోసియం వంటి ప్రత్యేక లోహాలను అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements) అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లుగానే ఇవి చాలా అదురుగా లభిస్తాయి, ప్రపంచంలోనే అత్యధికంగా చైనా భూమిలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోటార్లను వేగంగా & మన్నికగా తయారు చేయడంలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు, ఈ లోహాలలో ఎక్కువ భాగం చైనా నుంచి భారత్‌లోకి వచ్చాయి. భారతదేశానికి అరుదైన భూమి మూలకాల సరఫరాపై చైనా ఆంక్షలు విధించినప్పుడు, మన ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే, సింపుల్ ఎనర్జీ ఈ సవాలును స్వీకరించింది. ఈ కంపెనీ అంతర్గత పరిశోధన & అభివృద్ధి (R&D) బృందం ప్రత్యామ్నాయ పదార్థాలు & స్మార్ట్ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేసింది. పనితీరులో ఏ మాత్రం రాజీ పడని EV మోటారును డెవలప్‌ చేసి, చైనీస్ లోహాలపై ఆధారపడే అవసరాన్ని తొలగించింది.

సింపుల్ ఎనర్జీ కొత్త EV మోటార్ ఫీచర్లుఈ మోటారులో దాదాపు 95% భారతదేశంలోనే తయారవుతుందని, దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. ఈ మోటారు సింపుల్ వన్ జెన్ 1.5 (248 కి.మీ. రేంజ్‌) & వన్ ఎస్ (181 కి.మీ. రేంజ్‌) వంటి సింపుల్ ఎనర్జీ పాపులర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బిగిస్తారు. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న 2,00,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీలో ఈ మోటారు ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మేక్ ఇన్ ఇండియా'ను వాస్తవ రూపంలోకి తెచ్చామని సింపుల్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. 

Continues below advertisement

భారతదేశంలో EVల రేట్లు తగ్గుతాయా?రేర్ ఎర్త్-ఫ్రీ మోటార్ ఆవిష్కరణతో, భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఇకపై చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది EV మోటార్ & బ్యాటరీ తయారీ ఖర్చును ప్రభావితం చేస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఛార్జింగ్ టెక్నాలజీ ధరలను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత తక్కువ ధరతో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి, సరికొత్త ఆవిష్కరణ సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో భారతదేశ స్వావలంబనకు బలమైన పునాది వేస్తుంది.