Sai Durgha Tej Suggests To Riders At Traffic Summit 2025: ప్రమాద సమయంలో తాను హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో బయటపడినట్లు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ అన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన 'ట్రాఫిక్ సమ్మిట్ 2025' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

'అందరూ హెల్మెట్ ధరించాలి'

తాను ట్రాఫిక్ మీట్‌కు రావడం వెనుక వ్యక్తిగత రీజన్ కూడా ఉందని... అది అందరికీ తెలుసని సాయి దుర్గా తేజ్ అన్నారు. 'సెప్టెంబర్ 10, 2021లో నాకు యాక్సిడెంట్ జ‌రిగింది. రెండు వారాల కోమాలో ఉన్నా. సానుభూతి కోసం కాదు... అంద‌రికీ తెలియాల‌ని చెబుతున్నా. ఆ రోజు ప్రమాదంలో తలకు హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాను. కాబట్టి బైక్ నడిపే ప్రతీ ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. బైక్స్ వేగంగా నడపొద్దు. కారు న‌డిపే వాళ్లు సీట్ బెల్ట్స్ ధ‌రించాలి. రూల్స్ పాటిస్తే మీకే కాదు.. మీతో, ఎదురుగా ఉండే తోటి ప్ర‌యాణీకుల‌కు కూడా మంచిది.' అంటూ చెప్పారు.

Also Read: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌

డ్రైవ్‌కు వెళ్లడానికి టైం

ప్రమాదం తర్వాత తన అమ్మ సూచన మేరకు పూర్తిగా ధైర్యం వచ్చిన తర్వాతే బైక్ రైడింగ్ చేశానని సాయి తేజ్ తెలిపారు. 'బైక్ తాళాల‌ను మా అమ్మ నా చేతికిస్తూ ఒక మాట చెప్పింది. 'నా కొడుకు బైక్ రైడింగ్ అంటే భ‌య‌ప‌డాల‌ని, భ‌యంతోనే బ‌త‌కాల‌ని నేను కోరుకోవ‌టం లేదు. నువ్వు ఇంటి ముందున్న ఖాళీ ప్ర‌దేశంలో బైక్‌ న‌డిపి ధైర్యం వ‌చ్చిన త‌ర్వాతే రోడ్డు పైకి వెళ్లు' అని చెప్పింది. ఆమె చెప్పిన‌ట్లే హెల్మెట్ ధరించి ప్రతీ వారం ఆ ఖాళీ ప్లేస్‌లో బైక్ నడిపాను. ఇప్పటికి ఇంకా నేను రికవరీ అవుతున్నా. ఇంకా రోడ్డుపైకి డ్రైవ్‌కు వెళ్లడానికే టైం పడుతుంది.' అని చెప్పారు.

మామయ్య పవన్‌కు బైక్ రైడింగ్ ఇష్టం

తాను తన మామయ్య చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను వెనుక ఎక్కించుకుని ఎప్పుడూ డ్రైవ్ చేయలేదని అన్నారు సాయి తేజ్. 'ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయ‌న రైడింగ్ టైంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతుంటారు. ట్రాఫిక్ పోలీసులు మ‌నం గుర్తించ‌ని హీరోలు. ఇంట్లో మ‌నం భ‌యం లేకుండా ఉంటున్నామంటే అందుకు కార‌ణం అమ్మ‌, నాన్న‌, అక్క‌.. అలా కుటుంబ స‌భ్యులే. కానీ  మ‌నం బ‌య‌ట‌కు ధైర్యంగా వెళ్తున్నామంటే కార‌ణం పోలీసులే. వారికి సెల్యూట్ చేయాల్సిందే.' అని అన్నారు.

పోలీసులకు రిక్వెస్ట్

సాధారణంగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారిని, తాగి బండి నడిపే వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చైనా, ఫైన్ వేసైనా వదిలేస్తారని... అలా కాకుండా కొంచెం బెటర్‌గా చేస్తే బాగుంటుందని చెప్పారు సాయి తేజ్. 'నేను పోలీసుల‌నురిక్వెస్ట్ చేస్తున్నా. కౌన్సెలింగ్ ఫైన్ కాకుండా ఇంకా ఏదైనా బెట‌ర్‌గా చేస్తే బావుంటుంది. టీచ‌ర్ కొడ‌తాడ‌నే భ‌యంతో ఓ పిల్లాడు హోంవ‌ర్క్ చేస్తాడు. అలాగే హెల్మెట్ ధ‌రించ‌ని వాళ్ల‌కి, తాగి బండి న‌డిపేవాళ్ల‌కి చిన్న ప‌నిష్మెంట్ ఇస్తే బావుంటుంది. ఏది మంచిదో పోలీసులు ఆలోచించాల‌ని కోరుకుంటున్నా. అలా చేస్తే జీవితాల‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్ర‌మే.' అంటూ చెప్పారు.