Telangana BJP :   తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం వేదికగా జరిగిన పరిణామాలు చూస్తూంటే బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగకపోగా.. మరింతగా ముదిరాయన్న అభిప్రాయం  అందరికీ కలగడం సహజమే. చాలా మంది నేతలు పార్టీలో అంతర్గత విషయాలనే ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ సహజంగా ఇవే హైలెట్ అయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది తీరుతో మరికొంత మందిఅ అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారంమూ ఉపందుకుంది. కొంత మంది నేతలు అసలు ఈ కార్యక్రమానికే హాజరు కాలేదు. 


బండి సంజయ్ అసంతృప్తి ఎవరి పైన ?


పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని బండి సంజయ్ మనసులో ఉందని..తనపై కొంత మంది లేని పోని ఫిర్యాదులు చేశారని ఆయన మనసులో ఉంది. దీన్ని నేరుగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేడుక సందర్భంగా చేసిన ప్రసంగంలో వెల్లడించారు. నేతలు పత్రికల్లో కనిపిస్తారని.. వారికి ప్రజల్లో పలుకుబడి ఉండదన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని సలహా ఇచ్చారు. అదే సమయంలో తనపై లేనిపోని  ఫిర్యాదలు చేస్తూ..తరచూ ఢిల్లీ వెళ్లేవారని.. ఇప్పుడు కనీసం కిషన్ రెడ్డిని అయినా  ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని సలహా ఇచ్చారు. బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి అన్నారో వారంతా వేదికపైనే ఉన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతోంది. 


మధ్యలోనే  వెళ్లిపోయిన విజయశాంతి !


ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారు. కనీసం మాట్లాడలేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఆమె వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత తెలంగాణ వ్యతిరేకులు వచ్చారని.. వారు ఉన్నందువల్ల ఎక్కువ సేపు ఉండలేకపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆమె ఇలా పెట్టారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నారు. తర్వతా కాంగ్రెస్ లో మళ్లీ ఇప్పుడు బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు తెలంగాణ కార్యక్రమానికి ఆయన రావడాన్ని రాములమ్మ వ్యతిరేకించారు. అయితే రాములమ్మ ఓ కారణం మాత్రమే చెప్పారని... ఆమెకు గుర్తింపు లేదనే అసంతృప్తితోనే వెళ్లిపోయారని అంటున్నారు. కాంగ్రెస్ లో ప్రచార కమిటీ చైర్మన్ పదవిని వదులుకుని బీజేపీలోకి వస్తే..కనీసం పోటీ చేయడానికి ఓ నియోజకవర్గాన్ని కూడా ఇంక ఖరారు చేయలేదన్న అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు.  





 


పలువురు నేతలు గైర్హాజర్ !


కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన వారి మధ్య వివాదాలు ఏర్పడగా.. అసలు కార్యక్రమానికే రాని వాళ్లు ఉన్నారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ , ఏనుగు రవీందర్  రెడ్డి వంటి వారు హాజరు కాలేదు. వారంతా పార్టీ  మారుతారన్న ప్రచారం జరుగుతోంది. రానివారు.. వచ్చిన వారి మధ్య అసంతృప్తిని తక్కువగా అంచనా వేయలేమని బీజేపీ వర్గాలంటున్నాయి. ముందు ముందు బీజేపీలో జరిగే పరిణామాలను అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. 


కిషన్ రెడ్డికి కత్తి మీద సామే ! 


ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ.. కిషన్  రెడ్డి  బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కొద్ది కాలంలో  మొత్తం పార్టీ సిస్టమ్ ను యాక్టివ్ చేసి.. ఎన్నికలకు సిద్ధం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. నేతల్లో అసంతృప్తిని.. వర్గాలను సమన్వయం చేసుకుని.. చేసిన తప్పిదాల నుంచి బయటపడాలంటే.. కత్తి మీద సాము చేయాల్సిందేన్న బావన వ్యక్తమవుతోంది.