గవర్నర్‌ తమిళిసై బిల్లులను ఆమోదించకుండా పెండింగులో పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేసిన క్రమంలో మూడు బిల్లులకు ఆమోదం లభించింది. సుప్రీంకోర్టును మెప్పించేందుకే ఈ మూడు బిల్లులను పాస్ చేశారని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. మిగతా వాటిపై స్టడీ చేయాలని, అందుకే నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశం ఉందనేది ప్రభుత్వ వర్గాల వాదన. మరోవైపు తమిళనాడు గవర్నర్ విషయంలో స్టాలిన్ సర్కారు గట్టి నిర్ణయమే తీసుకుంది.  


 గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది- హరీష్ రావు


ఈ విషయంపై మంత్రి హరీష్ రావు సీరియస్‌గా స్పందించారు. కోర్టుల్లో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్‌ అవ్వని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను 7 నెలలుగా  గవర్నర్ ఆపారని హరీష్ గుర్తు చేశారు. రాజ్ భవన్ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసన్నారు. ఎన్ని కుట్రలు చేసైనా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలనే బీజేపీ వైఖరి తేటతెల్లమైందని అన్నారు. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా  అని ప్రశ్నించారు.


కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, 7 నెలలు అపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారని అన్నారు.  మా పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని హరీష్ రావు ప్రశ్నించారు. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 1961 నుంచే ఉన్నది. మరి అలాంటప్పుడు గవర్నర్ ఇలా వ్యవహరించడం సబబేనా అని ప్రశ్నించారు. హస్తిన నుంచి ఆదేశాలు రావడం.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం.. గవర్నర్ చేసే ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని హరీష్ అన్నారు. సరైన సమయంలో కేంద్రానికి తెలంగాణ సమాజం గుణపాఠం చెబుతుందన్నారు. స్వతంత్ర సంస్థలను పని చేయనీయకుండా చేయడం సమంజసం కాదని హితవు పలికారు. మూడు బిల్లులను ఆమోదించడం పట్ల గవర్నర్‌ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.


తమిళనాడు గవర్నర్ విషయంలో స్టాలిన్ సర్కారు గట్టి నిర్ణయమే


తమిళనాడు గవర్నర్ విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయమే తీసుకుంది. బిల్లులను పెండింగులో పెట్టడంపై తమిళనాడు శాసనసభ ఏకంగా తీర్మానమే చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలో ఆమోదం తెలిపేలా తక్షణమే గవర్నర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. తీర్మానానికి అనుకూలంగా డీఎంకే, కూటమి పార్టీలు ఓటు వేశాయి. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్య సూత్రాలను, అత్యున్నత శాసనసభ సార్వభౌమాధికారాన్ని గవర్నర్ కాలరాస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఈ సభ ఏకగ్రీవంగా కోరుతోందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిర్దిష్ట వ్యవధిలో గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు.


అణు విద్యత్ ప్లాంటు ఉద్యమకారులపై తమిళనాడు గవర్నర్ సంచలన ఆరోపణలు


మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ నిరసనకారులపై సంచలన ఆరోపణలు చేశారు. వారి నిరసనకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని గవర్నర్ రవి ఆరోపించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై నిరసనకారులు మండిపడ్డారు.  గవర్నర్ తమని అవమానించారని పేర్కొంటూ నోటీసు ఇచ్చారు అణు విద్యుత్ ప్లాంట్ నిరసనల సమన్వయకర్త ఎస్పీ ఉదయకుమార్. గవర్నర్ చేసిన వాఖ్యలు నిరసనలో పాల్గొన్న వేలాది మందిని అవమానించాయని.. చేసిన వాదనకు ఎటువంటి ఆధారం లేదని నోటిసుల్లో పేర్కొన్నారు.