బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి పక్షి బయటకు వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. తనను సంప్రదించకుండా తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేశారనంటేనే వీళ్ల భయమేంటో అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన సీఎం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ పాలన చేస్తుంటే ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు జూపల్లి కృష్ణారావు. వందిమాగాదులతో ప్రెస్‌మీట్ పెట్టించడం కాదని.. దమ్ముంటే తన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఆయన్ని తాను సూటిగా ఈ ప్రశ్నలు సంధిస్తున్నట్టు చెప్పారు.
గడచిన మూడు సంవత్సరాల నుంచి తనను పార్టీ నాయకుడిగా కూడా గుర్తించలేదన్నారు జూపల్లి కృష్ణారావు. అలా అనుకొని ఉంటే కచ్చితంగా సభ్యత్వ నమోదు కోసం పుస్తకాలు అడిగితే ఎందుకు ఇవ్వాలేదని ప్రశ్నించారు. తాను పార్టీలో లేనట్టుగా భావించిన బీఆర్‌ఎస్... ఇప్పుడు సస్పెండ్ చేయడమేంటని నిలదీశఆరు. తాను చేసిన ఆరోపణల్లో నిజాలు లేకుంటే నిర్భయంగా సమాధానాలు చెప్పాలన్నారు. వాళ్లు చెప్పేదాంట్లో నిజం ఉంటే మాత్రం తప్పు ఒప్పుకోవడానికి తాను సిద్ధమన్నారు. ఖజానాలో సొమ్మును ఇష్టారీతిన పంచుతున్నారా లేదా అని నిలదీశారు.
ఇలా పార్టీ, అధినేత బండాలు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే తనను సస్పెండ్ చేశారన్నారు కృష్ణారావు. తనను సస్పెండ్ చేసిన తర్వాత ఏం మాట్లాడినా వేరే పార్టీ కిందకు నెట్టేస్తారని... దానికి విలువు తగ్గించే ప్రయత్నం చేస్తారన్నారు. తెలంగాణ కోసం పారాడిన వ్యక్తుల్లో తాను ఒకడినన్నారు. అప్పట్లే ఆంధ్రప్రదేశ్ నేతలు చేసిన కామెంట్స్‌కు బాధపడి... పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చానని గుర్తు చేశారు. అసెంబ్లీ నడుస్తుండగానే రాజీనామా లెటర్‌ను సీఎంకు ఇచ్చానని ఆయన ఎన్ని ఆఫర్లు చేసినా ఉద్యమం కోసం పదవులను త్యాగం చేశానని చెప్పారు.
ఇప్పుడే పెద్ద పెద్ద మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి అప్పట్లో పార్టీ బలోపేతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తాను 2011లో టీఆర్‌ఎస్‌లో చేరక ముందు ఒక్క ఎమ్మెల్యే కూడా మహబూబ్‌నగర్ నుంచి లేరని అన్నారు. తాను వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు తెచ్చామన్నారు. అవన్నీ మర్చిపోయి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.