ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు, ఇంచార్జ్‌లు, నాయకులు జోష్‌తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా 'మెగా పీపుల్స్ సర్వే'కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం కనపడుతోంది. 


రాష్ట్రవ్యాప్తంగా ప్రజామద్దతు పుస్తకంలో 21 లక్షలకు పైగా కుటుంబాలు పాల్గొని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ది పాలనకు సంబంధించి వారి స్పందనలను నమోదు చేశారు. ఇప్పటి వరకు జగనన్నకు మద్దతు తెలుపుతూ 82960-82960 నంబర్‌కు 15 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రకటించింది. 


ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియ చేస్తూ ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అంటిస్తున్నారు. నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. అదే విధంగా సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ లను పంపిణి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సర్వే కార్యక్రమంపై రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. కోటి 60లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకునే పనిలో ఉన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలు. 


జగన్ స్టిక్కర్లకు ప్రతిపక్షాల కౌంటర్...


అధికార పార్టీకి చెందిన నాయకులు స్టిక్కర్‌ల పంపిణికి ప్రతిపక్షాలు కూడా కౌంటర్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. మా ఖర్మ నువ్వే జగన్...మా కొద్దు జగన్ అంటూ పోటీ స్టిక్కర్‌లను కూడా పంపిణి చేస్తున్నాయి. జగన్ కు సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ ఉన్నా.. దానికి పక్కనే ప్రతిపక్ష పార్టీకి చెందిన స్టిక్కర్‌ను వేసేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కౌంటర్ స్టిక్కర్‌లు వేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి విఫలమైన అంశాలు, గంజాయి వంటి మత్తు పదార్దాల రవాణా, శాంతి భద్రతల వైఫల్యాలు, జీవో నెంబర్ వన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 


సజ్జల కౌంటర్...
ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. అధికారంలో ఉండగా ఏమి చేయలేని తెలుగు దేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలపై అక్కసు వెల్లగక్కుతోందని అంటున్నారు. ఇలాంటి ప్రచారం చేయటం దుర్మార్గమని ఆ పార్టికి చెందిన సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమానత్వం దిశగా అడుగులు వెయ్యడంలో సీఎం జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారని, సంతృప్తి చెందారు కాబట్టి ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారని అన్నారు. 


మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు జనంలోకి వెళ్తుంటే మంచి స్పందన వస్తోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిందన్న విషయాన్ని గుర్తించారన్నారు. ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారని, భవిష్యత్‌లో ఇది కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వం  ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.