Jharkhand Politics: సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లో ఉన్నన్ని సెంటిమెంట్‌లు మరెక్కడా ఉండవు. ఒకసారి ఏదైనా వర్కౌట్ అయితే దాన్నే రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు. తాజాగా పొలిటికల్ సర్కిల్స్‌లో అలా వినబడుతున్న సెంటిమెంట్ " జైలు కెళ్ళు -సీయం పోస్ట్ కొట్టు". జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. మనీలాండరింగ్ కేసులో గతంలో 150రోజులపాటు జైలు జీవితం గడిపిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. జార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు వరుసగా రెండోసారి సీఎం అవ్వరు అనే సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి మరీ సోరెన్ రికార్డు సృష్టించారు.
సీఎంగా ఉన్నప్పుడు సోరెన్ కోట్ల రూపాయల విలువైన 8.8 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు చేశారనేది ఉన్న అభియోగం. అయితే ఆయన పాత్రకు సంబంధించి ఆ కేసులో ప్రత్యక్ష ఆధారం ఏదీ లభించలేదంటూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో 150 రోజుల తర్వాత ఏడాది జూన్‌లో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. తర్వాత ఎన్నికల్లో గెలిచి జార్ఖండ్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీలో జైలుకెళ్లి ముఖ్యమంత్రులైన జగన్, చంద్రబాబు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, జగన్ ఇద్దరూ జైలు జీవితం గడిపిన వాళ్లే. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపిన జగన్మోహన్ రెడ్డి 2019లో 151 సీట్లను సాధించి తొలిసారి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి అదే రికార్డు విజయం. ఆ కేసుల విచారణ ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో గడపాల్సి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు పాటు సెంట్రల్ జైల్లో పెట్టింది అప్పటి జగన్ ప్రభుత్వం. ఆ కేసులో బెయిల్ తీసుకుని బయటికి వచ్చిన చంద్రబాబు కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లి 164 సీట్లతో కనీ విని ఎరుగని విజయం సాధించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులూ జైలుకెళ్లిన అనుభవం ఉన్నవారే కావడం విశేషం.
తెలంగాణలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జైలు జీవితం గడిపినవారే. ఓటుకు నోటు కేసులో టిడిపి నేతగా రేవంత్ రెడ్డి ఉన్నటైంలో జైల్లో పెట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో గెలిచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి.
నెక్స్ట్ అదే సెంటిమెంట్ పై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరు నెలల పాటు జైలు జీవితం గడపారు. సిబిఐ, EDలు దాఖలు చేసిన కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేశారంటూ కేజ్రీవాల్ న్యాయపోరాటం చేశారు. బెయిల్ బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గెలిచి సీఎంగానే ఆఫీస్‌కి వస్తాను అంటూ తన ముఖ్యమంత్రి పీఠాన్ని త్యాగం చేశారు. ప్రస్తుతం జైలుకు వెళ్లి వచ్చిన నేతలు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సెంటిమెంట్ పై ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే వచ్చే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. అయితే ఇలాంటి సెంటిమెంట్ల గురించి మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నా.. రాజకీయ నాయకుల తలరాతను మార్చేది మాత్రం ఓటర్లే..!
Also Read: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం