Siddha Raghavrao Resigned From YCP: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రకాశం జిల్లాలోని కీలక నేత సిద్ధా రాఘ వరావు రాజీనామా చేశారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అధికారాన్ని కోల్పోయిన తరువాత పలువురు నేతలు వరుసగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘరావు పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అందులో ఆయన పేర్కొన్నప్పటికీ.. ఇతర అంశాలు ఆయన రాజీనామాకు కారణంగా చెబుతున్నారు. 


వైసీపీలోకి అప్పుడే చేరిక


గతంలో మంత్రిగా పని చేసిన శిద్ధా రాఘరావరావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. 2024కి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే, టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో ఆయన వైసీపీలోనే ఉండిపోయారు. దర్శి టికెట్‌ కూడా ఈయనకు లభించలేదు. అయినా సరే మాట్లాడలేని పరిస్థితి. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూడడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాజా నిర్ణయం తరువాత ఆయన ఎటువైపు అడుగులు వేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందే టీడీపీలో చేరేందుకు యత్నించగా అధిష్టానం అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించే అవకాశం ఉందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. అదే సమయంలో ఆయన బీజేపీ వైపు గానీ, జనసేన వైపుగానీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, కొంత సమయం తీసుకున్న తరువాత ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. 


అదే బాటలో మరికొందరు నేతలు


సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న తరువాత అనేక మంది నేతలు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే జిల్లాకు చెందిన బాలినేని కూడా జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగింది. అయితే, దీనిపై ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే, మరి కొంత మంది ముఖ్య నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, కొద్ది రోజుల్లోనే ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశముందని చెబుతున్నారు. చూడాలి మరీ వైసీపీ నుంచి బయటకు వెళ్లే నేతలను ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుందో.