Kaushik Reddy Versus Arikepudi Gandhi: తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy), శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ చేసిన అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‌లోని ఆయన నివాసానికి గురువారం ఉదయం వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించగా.. దీనిపై గాంధీ సైతం అదే స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించగా.. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, గుడ్లు, టమోటాలతో దాడి చేశారు. ఇంట్లో పూలకుండీలతో అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు.


గాంధీ బైఠాయింపు.. అరెస్ట్


ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే అరికెపూడి గాంధీ తన అనుచరులతో బైఠాయించారు. పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని.. లేకుంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో పోలీసులు గాంధీని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.


బీఆర్ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగ్గా లేదని అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని.. ఆయన కోవర్టుగా వ్యవహరించారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా బీఆర్ఎస్‌లో స్థానం కల్పించారని.. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.


ఇదీ జరిగింది


కాగా, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. 'అరికెపూడి తనతో పంచాయతీ అని పదే పదే చెబుతున్నారు. బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో ఎలా చేరుతారు.?. భూ పంచాయతీలో సెటిల్‌మెంట్ల కోసమే కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. అరికెపూడి బీఆర్ఎస్‌లో ఉంటూ తెలంగాణ భవన్‌కు రావాలి. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకు వెళ్దాం. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి వెళ్తాం. ఆయన్ను సాదరంగా తోడ్కొని కేసీఆర్ వద్దకు వెళ్తాం. కాంగ్రెస్‌లో చేరలేదని అరికెపూడి అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టే ఆయన ఇంటికి వెళ్తామంటున్నాం.' అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.


'చర్యకు ప్రతిచర్య ఉంటుంది'


అటు, తన ఇంటి వద్ద అరికెపూడి ఆందోళన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎలా రక్షణ ఇస్తుందని ప్రశ్నించారు. 'హత్య చేయడానికే నా ఇంటి వద్దకు వచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిస్తాం. గురువారం అరికెపూడి గాంధీ చేసిన చర్యకు శుక్రవారం ప్రతిచర్య ఉంటుంది. నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను. దాడి విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్దామని ఫోన్ చేస్తే ఎత్తలేదు. శుక్రవారం ఉదయం అరికెపూడి ఇంటికెళ్లి గులాబీ కండువా కప్పుతాం.' అని పునరుద్ఘాటించారు.


Also Read: Crime News: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ - రోడ్డెక్కిన 500 మందికి పైగా విద్యార్థినులు