Girl Students Harassed By Staff In Rajanna Siricilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Siricilla District) దారుణం జరిగింది. తమను పీఈటీ వేధిస్తోందని దాదాపు 500 మందికి పైగా విద్యార్థినులు గురువారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో (Tribal Welfare Gurukul School) పని చేస్తోన్న పీఈటీ జ్యోత్స్న తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయం 5 గంటలకే సిద్ధిపేట ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. వందల మందికి పైగా విద్యార్థినులు ఉన్న పాఠశాలలో రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. నెలవారీ పీరియడ్స్ ఉన్న సమయంలోనూ బాత్రూంలో స్నానం చేస్తుంటే.. పీఈటీ టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలకొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.


'ఆమె ఓ సైకో'


పీఈటీ ఓ సైకో అని.. బైపీసీ మొదటి సంవత్సర విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడ్డారు. ఆమె ఆగడాలు భరించలేకే ధర్నాకు దిగామని వివరించారు. తాము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోపలికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ దుర్భాషలాడుతూ, కొడుతూ తీసుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఈటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సైకో టీచర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చచెప్పారు. ఎంఈవో రఘుపతి ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తప్పిస్తున్నామన్న డీఈవో హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.


Also Read: Telangana: మీ ఇంటికొస్తానన్న కౌశిక్‌ రెడ్డి- రా తేల్చుకుందాం అంటూ అరికెపూడి గాంధీ సవాల్‌- హీటెక్కిన గ్రేటర్ పాలిటిక్స్