Kaushik Reddy Vs Arekapudi Gandhi:  తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు మరోసారి కాకమీద ఉన్నాయి. దీనిపై ప్రెస్‌మీట్ పెట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు ఉంటే పార్టీ మారిన స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలని అన్నారు. లేకుంటే వారందరికీ చీర గాజులు పంపిస్తానంటూ అన్నారు. వాటిని వేసుకొని తిరగాలని సూచించారు. ఎప్పుడూ కేసీఆర్ వ్యక్తిగతగా ఏ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదని అలా నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. 


మరోవైపు అరికెపూడి గాంధీపై కూడా కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని సవాల్ చేశారు. లేకుంటే తానే గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరేసి వస్తానని అన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెడతానంటూ సవాల్ చేశారు. 
ఈ సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆతన ఇంటి నుంచి వెళ్లి గాంధీ ఇంటి వద్ద హడావిడి చేస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన పోలీసులు ఆయన్ని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా అరెస్టు చేసే వేరే ప్రాంతానికి తరలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. 


కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసారు. 11 గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే 12 గంటలకు తానే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ సవాల్ చేశారు గాంధీ. కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు. కానీ కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్లతోనే అసలు సమస్య వస్తోందని మండిపడ్డారు. దీంతో అరికెపూడి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ని కూడా హౌస్ అరెస్టు చేశారు. 


మరోవైపు కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. ఆయన చేసిన చీరా గాజుల విమర్శలపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు బీఆర్‌ఎస్‌ పుట్టుకే ఫిరాయింపులతో మొదలైందని అన్నారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడితే మాత్రం కౌశిక్ రెడ్డికి కచ్చితంగా చెప్పుతో బుద్ధి చెబుతామన్నారు. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్లు పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వీటిని ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ఏం పంపాలని ప్రశ్నించారు.