Telangana politics Harish Rao hot Topic: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావుపై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై బీఆర్ఎస్ పార్టీలో సందేహం వచ్చేలా మాట్లాడుతున్నారు. అది కూడా ఓ రకంగా దాడే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో హరీష్ రావు సెంటరాఫ్ పాలిటిక్స్ గా మారారు. ఆయనే ఎందుకు ఇంత కీలకంగా మారారు?
కవిత, రేవంత్ ఇద్దరిదీ హరీష్ విషయంలో ఒకటే ప్లాన్
హరీష్ రావు ప్రస్తుతం ఆయన రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సొంత పార్టీ నేతలు, మరోవైపు ప్రత్యర్థి పార్టీల వ్యూహాల మధ్య హరీష్ రావు శీలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనే భారీ స్కెచ్ నడుస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కవిత ఆయనపై చేస్తున్న ఆరోపణలు పార్టీ కేడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల నుంచి పార్టీ అంతర్గత పరిణామాల వరకు హరీష్ రావునే బాధ్యుడిని చేసేలా ఆమె ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని అడ్డుకుని, పార్టీని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు హరీష్ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారని కూడా ప్రకటించారు.
సీఎం రేవంత్‌దీ అదే వ్యూహం !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం భిన్నమైన మార్గంలో ఉన్నా హరీష్ ను బీఆర్ఎస్ కు దూరం చేయడంలో భాగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావును పొగుడుతున్నట్లుగా.. బీఆర్ఎస్ పార్టీ ఆయన గుప్పిట్లోకి పోతుందని.. ఆయనే నాయకత్వం వహిస్తారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఫెయిలయ్యారని అంటున్నారు. హరీష్ రావుపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం ద్వారా, కేటీఆర్ నాయకత్వానికి ఆయన వ్యతిరేకమన్నట్లుగా రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ మాటలు ఇబ్బందికరంగా మారేలా ఉండటంతో హరీష్ రావు వెంటనే స్పందించారు. కేటీఆర్‌కు తనకు..మిత్రభేదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉన్నాయని చెబుతున్నారు.
కేటీఆర్ వర్గమూ హరీష్ పై అనుమానపు చూపులు !
కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉండే కనిపించని పోటీ ఉందన్న చర్చ బీఆర్ఎస్‌లో ఉంది. క్షేత్రస్థాయిలో హరీష్ రావుకు ఉన్న పట్టు కేటీఆర్‌కు లేదని అంటున్నారు. అయితే కేసీఆరే తమ నేత అని ఆయన ఏది చెబితే అది చేస్తామని హరీష్ రావు అంటున్నారు. కానీ హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయగలిగితే, బీఆర్ఎస్ బలహీనపడటమే కాకుండా చీలిపోయే అవకాశం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. అందుకే అందరూ కలిసి ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ అంతా సజావుగానే ఉందని చూపిస్తున్నా, లోలోపల పెరుగుతున్న అనుమానాల సెగ ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు తన అస్తిత్వాన్ని, విశ్వసనీయతను ఎలా కాపాడుకుంటారో అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.