BRS Candidates :  ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం పేరుతో భారీగా ఇప్పుడే ఖర్చుపెట్టుకోవద్దని పార్టీ నేతలు ఇంతకు ముందు బీఆర్ఎస్ హైకమాండ్ సందేశం పంపింది. కానీ ఇప్పుడు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా స్పష్టత వచ్చింది. వచ్చే నెల పదో తేదీ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్‌లో మాత్రం గతంలో కనిపించినంత ఉత్సాహం కనిపించడం లేదు. 


అభ్యర్థుల్ని ప్రకటించి నెలపైనే - క్షేత్ర స్థాయిలో కనిపించని హడావుడి 


ఎన్నికలకు ఇంకా దాదాపుగా నాలుగు నెలలు ఉండగానే  115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాంతో జనం వద్దకు వెళ్లేందుకు, ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేందుకు కావాల్సినంత సమయముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావించాయి. తద్వారా ప్రతిపక్షాలపై పైచేయి తమదేనని అంచనా వేశాయి.  జాబితాను విడుదల చేసి నెల అవుతున్నా  గులాబీ పార్టీలో మాత్రం ఆ జోష్‌ కానరావటం లేదు. తొలి జాబితా తర్వాత సీఎం కేసీఆర్  రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తారని అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప సీఎం జిల్లాలకు వెళ్లిన దాఖలాల్లేవు. 


ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఎమ్మెల్యేలు, అభ్యర్థులు 


క్షేత్రస్థాయిలోని ఎమ్మెల్యేలు కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, పింఛన్ల పంపిణీ, ఎక్స్‌గ్రేషియోలు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ తదితర ప్రభుత్వ అధికారిక వేదికల మీది నుంచే రాజకీయ విమర్శలు చేయగలుగుతున్నారు తప్పితే స్పష్టంగా పొలిటికల్‌ యాక్టివిటీలో పాల్గొనకపోవటం గమనార్హం. మూణ్నెల్ల ముందే జాబితాను ప్రకటించటంతో అన్ని నెలలపాటు కార్యక్రమాల నిర్వహణ తలకు మించిన భారమవటం ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో నైరాశ్యానికి ఒక కారణమైతే… అంతకు మించిన ప్రధాన కారణం మరొకటి ఉందనే ప్రచారం బీఆర్‌ఎస్‌లో జోరుగా కొనసాగుతోంది. టిక్కెట్‌ దక్కిందని మురిసిపోతున్న వారెవ్వరికీ బీ-ఫామ్‌ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటమే అసలు సిసలు కారణమని చెబుతున్నారు. ప్పటి నుంచే తొందరపడకుండా, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత, బీ-ఫామ్‌ చేతికందిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.


చేరికలు సభలతో  కాంగ్రెస్ హడావుడి 


 ప్రతిపక్ష కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభలు, చేరికలతో హడావుడిని సృష్టిస్తోంది. చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చే్శారు. రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. మరికొంత మంది కీలక నేతలు కూడా చేరబోతున్నారని చెబుతున్నారు. మరో వైపు భారీ ఎత్తున బీసీ గర్జన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బీఆర్ఎస్‌లో ఓ రకమైన నిర్లిప్తమైన వాతావరణం కనిపిస్తూంటే.. కాంగ్రెస్ లో మాత్రం.. చేరికలు..సభలు.. అభ్యర్థుల జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 2018లో ఒక ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ బాస్‌…ఆ క్రమంలో పార్టీలో, క్యాడర్‌లో జోష్‌ను పెంచి, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లకుండా నిర్ణీత సమయంలోనే ఎన్నికలకు వెళుతూ… మూణ్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా అప్పటి హుషారు ఇప్పుడు ఆ పార్టీలో, కార్యకర్తల్లో  కనిపించకపోవడం  ఆ పార్టీలోనూ చర్చకు కారణం అవుతోంది.