3 Years of YSR Congress Party Rule :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టక ముందు, చేపట్టినప్పుడు ఆయన చుట్టూ ఎంతో మంది ఆత్మీయులు ఉండేవారు. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఉండేవారు. సీఎం జగన్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వీరంతా పోరాడారు.  అయితే ఇలాంటి వారిలో మూడేళ్లలో చాలా మంది సీఎం జగన్‌కు దూరమయ్యారు. చివరికి కుటుంబంలోనూ విభేదాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


వైఎస్ కుటుంబంలో చీలిక !   


వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థానంలో కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకున్న  జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏకతాటిపైన ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారన్న అభిప్రాయ మూడేళ్లలో ఎక్కువగా వినిపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు,  తల్లి విజయలక్ష్మితోనూ మాటల్లేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇక చెల్లితో వివాదాల గురించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ కుటుంబంలో  భార్య తరపు బంధువులు తప్ప.. ఇతరులతో సన్నిహిత సంబంధాలు పూర్తిగా కొరవడ్డాయని వైఎస్ఆర్‌సీపీలో ప్రచార ంజరుగుతోంది. కుటుంబ ఏకతాటిపై ఉంటేనే రాజకీయంగా కూడా బలంగా ఉంటారు. కానీ కుటుంబాన్నే జగన్ ఏకతాటిపైకి ఉంచలేకపోయారు.  షర్మిల తెలంగాణలో సొంతపార్టీ పెట్టుకున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో మరో చెల్లి .. వివకా కుమార్తె సునీతారెడ్డి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇటీవల కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఆరోపణలతో సమీప బంధువు వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేయడంతో కుటుంబంలో గ్యాప్ మరింత పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. 


విజయం కోసం శ్రమించిన ఆత్మీయులూ దూరమయ్యారు ! 


ఎన్నికలకు ముందు అధికారంతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆత్మీయులు జగన్ చుట్టూ ఉండేవారు. ఆయనను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేసేవారు.  కానీ మాకు కనీసం అపాయింట్ మెంట్ కూడా లేదు.. మా బాధలు వినేవారు లేరని.. క్రిస్టియన్ సంఘాలు బ్రదర్ అనిల్ కుమార్‌తో గోడు వెళ్లబోసున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ వంటి వారు కూడా దూరమయ్యారు. వారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.  అప్పట్లో జగన్‌కు మద్దతుగా పలు సంఘాలు పోరాడాయి. అప్పటి టీడీపీ వ్యతిరేక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అయితే ఇప్పుడు అలాంటి వారంతా దూరమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  


రాజకీయంగానూ జగన్ ఒంటరయ్యారా ? 


అసెంబ్లీ ఎన్నికలకు ముందు  టీఆర్ఎస్ గొప్ప దోస్తీ ఉండేది. గెలవగానే.. ముందుగా కేసీఆర్ తో సమావేశానికి వెళ్లారు. బీజేపీ కూడా పరోక్షంగా సహకరించింది. రెండు పార్టీలు అంత ఆత్మీయంగా ఉన్నాయా..? అంటే చెప్పడం కష్టం. టీఆర్ఎస్ ఏపీ పాలనను అవహేళన చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడాన్ని తప్పు పడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. కేటీఆర్ కూడా ఏపీ నరకం అయిందని బహిరంగంగా మాట్లాడారు. దావోస్‌లో జగన్ ఈగలు తోలుకుంటున్నారని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు.  మరో వైపు  బీజేపీ  పైకి సహకరిస్తున్నట్లుగా ఉంది కానీ వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా మారిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నేతలు జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు , 


వాళ్లంతా ఎందుకు దూరమయ్యారు ?


రాజకీయాల్లో వ్యక్తిగత గెలుపులు ఎప్పుడూ ఉండవు. మన కోసం ఎంత మంది ఉంటారన్నదానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెబుతూ ఉంటారు.  ఆయన గెలవడానికి బలం ..  బలగం సాయం చేసింది. ఇప్పుడు ఆ బలం.. బలం ఎంత వరకూ ఆయన వెంట ఉందనేదానిపై వైఎస్ఆర్‌సీపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. అందుకే మూడేళ్ల పాలన సందర్భంగా సీఎం జగన్ కూడా సమీక్ష చేసుకోవాలన్న సూచనలు సొంత పార్టీ నుంచి వస్తున్నాయి.