Power Politics : ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.3,441.78 అసలు లేటే పేమెంట్ ఫీజు రూ. 3,315.14 అదనంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ విద్యుత్ బకాయిల చెల్లింపు వివాదం ఇప్పటిది కాదు. 2017 నాటిది. విభజన చట్టంలో చెప్పారని చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంటి తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ సరఫరా చేసింది. అయితే దానికి డబ్బులు చెల్లించకపోవడంతో నిలిపివేసింది. ఆ మూడేళ్ల పాటు సరఫరా చేసిన దానికి ఇంత వరకూ డబ్బులు చెల్లించలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటి జగన్ ప్రభుత్వం కూడా తెలంగాణను కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం స్పందించి కట్టాలని తెలంగాణను ఆదేశించింది.
అసలేమిటి కరెంట్ బకాయిల వివాదం !
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటున్న కారణంగా.. విభజన చట్టంలో 57 శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు. మామూలుగా అన్ని వ్యవహారాల్లో పంపకాలు జనాభా ప్రాతిపదకిన జరిగాయి. ఏపీకి ఎక్కువ కేటాయించారు. కానీ కరెంట్ విషయంలో మాత్రం తెలంగాణ అవసరాల్ని గుర్తించారు. అయితే అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అ చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయితే తెలంగాణ పట్టించుకోలేదు. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని అవసరాలు తీర్చుకుంది. అప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం తెలంగాణను బకాయిలు చెల్లించాలని అడుగుతూనే ఉంది.
ఎన్సీఎల్టీని ఆశ్రయించిన గత ప్రభుత్వం !
కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని వాదిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
తమకే రూ. 12, 490 కోట్లు రావాలంటున్న తెలంగాణ !
ప్రస్తుతం కేంద్రం కట్టాలని ఆదేశించినవి కాకుండానే ఏపీ నుంచి తమకు రూ. 12, 490 కోట్లు రావాలని తెలంగామ వాదిస్తోంది. 2017లో ఏపీ ఉద్దేశపూర్వకంగానే పీపీఏలను పట్టించుకోకుండా.. థర్మల్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయకుండా నిలిపివేసింది. ఆ లోటును పూడ్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును తెలంగాణ కొనుగోలు చేసింది. దీనివల్ల కలిగిన అదనపు భారానికి సంబంధించి బకాయిలు … అలాగే జల విద్యుత్తు , మాచ్‌ఖండ్, టీబీ డ్యాం విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణకు అయిన అదనపు ఖర్చు వడ్డీతో కలిపి రూ.6639 కోట్లు ఉంటుందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. అలాగే రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వడ్డీతో కలుపుకొంటే.. రూ.3,819 కోట్లు ఉన్నాయి. అలాగే పవర్ పర్చేజ్‌కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు చెల్లించాలి. ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1,730 కోట్లు రావాలి. దీనితోపాటు ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణకు రూ.4,026 కోట్లు రావాలని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.1,614 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుని.. ఏపీకి ఇవ్వాల్సిన వాటినీ తీసేస్తే.. రూ.12 వేల 490 కోట్ల కంటే ఎక్కువే ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది.
రెండు రాష్ట్రాల వివాదమని పార్లమెంట్‌లో చెప్పిన కేంద్రం !
తెలంగాణ చెబుతున్న లెక్కలతో ఏపీ ప్రభుత్వం ఏకీభవించడం లేదు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన విద్యుత్‌కు చెల్లింపులు చేయాలని.. ఇతర ఖాతాలు ఏమైనా ఉంటే విడిగా చూసుకోవాలని చెబుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎలా కలుపుతారని ప్రశ్నిస్తోంది. తెలంగాణకు ఏమైనా రావాలంటే .. ముందుగా ఇవ్వాల్సిన వాటిని ఇచ్చిన తర్వాతే చర్చించాలని అంటోంది. తెలంగాణ …ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలపై ఏంచేశారని విజయసాయిరెడ్డి గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లిందని విషయం కోర్టులో ఉన్నందున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని సమస్యనుపరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో సూచించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కేంద్రం.. తెలంగాణ బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. దీంతో రెండు రాష్ట్రాలతో పాటు ఈ పంచాయతీలోకి కేంద్రం కూడా వచ్చినట్లయింది.
తెలంగాణ చెల్లించదు .. వివాదం ముదరడం ఖాయం !
విద్యుత్ బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధపడే ్వకాశం లేదు. ఈ విషయం కేంద్రం ఆదేశాలు వచ్చిన వెంటనే.. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన చూస్తే అర్థమైపోతుంది. కోర్టులో ఉన్న అంశం కాబట్టి అడ్వాంటేజ్‌గా తీసుకునే చాన్స్ ఉంది. పైగా తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు చెల్లింపులు చేసి వివాదం పరిష్కారమయ్యే అవకాశాలు చాలా తక్కువని అనుకోవచ్చు.