Telugu Desam Party cadre Unhappy  :  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందు కోసం ఆ పార్టీ క్యాడర్ శక్తివంచన లేకుండా పని చేసింది. ఐదేళ్ల పాటు వారు ఎదుర్కొన్న కష్టాలు, వేధింపులతో చావో రేవో అన్నట్లుగా పార్టీ కోసం నిలబడ్డారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. వారు అనుకున్నట్లుగా పార్టీ అధికారంలోకి వచ్చింది. యాభై రోజులు అవుతుంది. కానీ ఆ పార్టీ క్యాడర్ లో అధికారంలోకి వచ్చామన్న జోష్ లేదు. సొంత పార్టీ అధినాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనికి కారణం తాము అనుకున్నట్లుగా వైసీపీ నేతలు, క్యాడర్‌పై చర్యలు లేకపోవడమే. వైసీపీకి కొమ్ము కాసిన అధికారుల్ని చూసీ చూడనట్లుగా వదిలేయడమే. రాను రాను టీడీపీ క్యాడర్ అసంతృప్తి సోషల్ మీడియాలో పెరిగిపోతోంది. 


అధికారం వస్తే ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా పని చేసిన టీడీపీ క్యాడర్


తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో  గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత కఠినమైన  పరిస్థితుల్ని ఎదుర్కొంది. అధికార వైసీపీ, ఆ పార్టీ చీఫ్ జగన్. టీడీపీని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా.. శత్రువుగా.. టీడీపీ నేతల్ని వ్యక్తిగత శత్రువులుగా  చూశారు. సీఐడీ విభాగాన్ని, ప్రత్యేకంగా కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారిక ఫుల్ పవర్స్ ఇచ్చి మరీ ఏర్పాటు చేసిన సిట్‌ను అందు కోసం కేటాయించారు. చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకూ వీరి దెబ్బకు జైళ్లకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా మూడు వేల కేసులు పార్టీ నేతలు, క్యాడర్‌పై నమోదు చేశారని లెక్క తేల్చారు. అధికారంలోకి వచ్చి తమపై వేధింపులకు  పాల్పడిన నేతలు, అధికారులపై కసి తీర్చుకోవాలని క్యాడర్ అంతా కసిగా పని చేశారు. 


కుప్పం వైఎస్ఆర్‌సీపీ ఖాళీ - జాడలేని ఇంచార్జ్ - టీడీపీలో చేరిపోతున్న ద్వితీయశ్రేణి కార్యకర్తలు


అధికారంలోకి వచ్చి యాబై రోజులు అయినా చంద్రబాబు సాత్విక పాలన !


చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి యాభై రోజులు అయింది. అయితే అనుకున్న విధంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదు. మరీ దారి తప్పిన అధికారులుగా భావించిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచనలు ఇంకా చేయలేదు. ఇక ప్రత్యేక్షంగా క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన పోలీసులు, ఇతర అధికారులు, వైసీపీ నేతలపై కూడా చర్యలు ప్రారంభించలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా  అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతంలోలాగే దిలాసాగా ఉన్నారు. తాము చిన్న పోస్టు పెడితనే పోలీసులు అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారని అంతకు మించి ఊహించుకుంటే.. వారినేమీ చేయడం లేదని టీడీపీ క్యాడర్ అసహానానికి గురవుతున్నారు. అంతకు మించి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్ పోర్టులో అరెస్టు చేసి తిరుపతికి తీసుకు వచ్చి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. హత్యాయత్నం సెక్షన్లు పెట్టి ఇలా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం ఏమిటని ..మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఈ పరిణామాలన్నీ.. టీడీపీ కార్యకర్తల్ని నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకోలేమా అని.. మథనపడుతున్నాయి. 


పవన్‌ను ఇరుకున పడేసిన బండి సంజయ్ స్టేట్మెంట్‌- సమాధానం చెప్పాలని నిలదీస్తున్న వైసీపీ


అన్నీ చట్ట  ప్రకారమే జరుగుతాయంటున్న చంద్రబాబు


రెడ్ బుక్ పేరుతో ప్రత్యేకంగా జాబితా రెడీ చేసుకున్న లోకేష్ కూడా ఇంకా తాము రెడ్ బుక్ తెరవలేదంటున్నారు. చంద్రబాబు అంతా చట్ట ప్రకారమే చేద్దామంటున్నారు. కానీ ఆ చట్టం ప్రకారం కూడా వైసీపీ నేతలపై విపరీతమైన ఉదారత చూపిస్తున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. నేరుగా నేరాలు చేసి దొరికినా పట్టించుకోవడం లేదని కక్ష సాధింపులన్న ఆరోపణలు వస్తాయన్న కారణంగా అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో ఉన్నారని.. కింది స్తాయి నేతల్ని టార్గెట్ చేయడం కన్నా.. అసలు పెద్ద చేపల్నే చట్ట ప్రకారం బుక్ చేసేందుకు చాపకింద నీరులా పని చేస్తున్నారని.. వచ్చే జనవరి నాటికి పార్టీ కార్యకర్తలంతా సంతృప్తి చెందేలా చర్యలుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీతో అంటకాగిన అధికారుల్ని కింది స్థాయి నుంచి  ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. డీఎస్పీల్ని 57 మందిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సీఐ,ఎస్ఐ స్తాయి పోలీసుల్లో క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది. 


అధికారం అందగానే కక్ష సాధింపులకు పాల్పడితే.. చెడ్డపేరు వస్తుందని టీడీపీ అధినేత భావిస్తున్నారు.  చట్ట ప్రకారం చేసినా కక్షసాధింపులు అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరో వైపు వైసీపీ అధినేత కూడా పెద్దగా ఏమీ లేకపోియనా... హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో కూడా ప్రచారం చేశారు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని ఇది టీడీపీ క్యాడర్ లో  అసహనానికి గురి చేస్తోందని చెబుతున్నారు.