TS Congress :  తెలంగాణలో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. మొత్తం రాష్ట్ర నేతలకే వదిలేకుండా ... జాతీయ స్థాయిలో ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని.. అగ్రనేతలను భాగస్వామ్యం చేస్తోంది. ప్రియాంకా గాంధీ తెర వెనుక. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెర ముందు తెలంగాణ ఎన్నితల బాధ్యతలు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ రాజకీయ వ్యూహాల్లో దిట్ట. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆయన వ్యూహమేనని చెబుతూంటారు. మరి తెలంగాణలోనూ ఆయన మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా ?


తెలంగాణ అసెంబ్లీ పోరు కోసం కాంగ్రెస్ రెడీ ! 


తెలంగాణ  రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ రెండు సార్లు  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణ లోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. అందుకే  కొత్త మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను హైకమాండ్ ప్రతినిధిగా ప్రియాంక గాంధీ  పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వరకు తెలంగాణలో వరుస పర్యటనలకు సిద్దం అవుతున్నారు. పార్టీలో చేరికలు..క్షేత్ర స్థాయి ప్రణాళికల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్  కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.  కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జేడీఎస్ కారణంగా చీలకుండా కాంగ్రెస్ చేసిన ప్రచార వ్యూహాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. ఈ వ్యూహాలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా అవసరమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 


కేసీఆర్ కు వ్యతిరేకంగా  రాజకీయ శక్తుల పునరేకకరణ ప్రయత్నాలు


కేసీఆర్ ను ఓడించేది కాంగ్రెస్సే అన్న అభిప్రాయం తీసుకు రావడానికి  .. బీఆర్ఎస్ ను ఓడించడానికి రెడీ అయ్యే అన్ని  పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ప్రారంభమైన చేరికల వెనుక డీకే శివకుమార్ మంత్రాంగం పని చేసిందని చెబుతున్నారు.  ప్రభుత్వం వ్యతిరేక ఓటు..కాంగ్రెస్  అనుకూల ఓటు చీలకుండా కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని డీకే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బెంగళూరు నుంచే ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీలో చేరాలనుకున్న వారు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలుస్తున్నారని చెబుతున్నారు. 


పోల్ మేనేజ్ మెంట్ వరకూ శివకుమార్ దే కీలక పాత్ర ! 
 
కొద్ది రోజులుగా బెంగుళూరు  వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీలో చేర్చుకొనే ముఖ్య నేతలు నేరుగా బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారు. ఆయనతో చర్చల తరువాత పార్టీలో చేరికకు సిద్దం అవుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి , ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌ రెడ్డి ని కాంగ్రెస్‌లోకి చేర్పించే విషయంలోనూ శివకుమార్‌ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.  రేవంత్ తో పాటుగా ఈ ముగ్గురు నేతలు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ఈ నెల 14న కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటనకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమకారుడు. శ్రీహరిరావు (  బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించారు. కేసీఆర్‌  ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో ఏర్పాటు చేసే సభలో వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.


మొత్తంగా ప్రియాంక, శివకుమార్ జోడి కాంగ్రెస్ ను గెలిస్తే.. అది సంచలన విజయం ఖాయాలో చేరడం ఖాయం. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన స్వింగ్ ఈ విజయం తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు.