నేటి(బుధవారం,  జూన్ 14 ) నుంచి వారాహి ప్రజాక్షేత్రంలోకి రానుంది. అన్నవరం నుంచి జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. ఉదయం 9 గంటలకు సత్యదేవుడి దర్శనం తర్వాత యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తున్నారు పవన్. 


కాకినాడ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. అన్నవరంలో ప్రారంభమయ్యే యాత్ర కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యల అర్జీలు0 స్వీకరిస్తారు. అంటే ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో ఈ సందర్శన ఉంటుందని రూట్‌ మ్యాప్‌లో చెప్పారు. 


పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగిన ప్రాంతాలకు భారీగా జనసైనికులు తరలి వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, యువత తరలివస్తున్నారని నాయకులు చెబుతున్నారు. 


మొదటి విడతలో జూన్‌24 వరకు యాత్ర సాగనుంది. యాత్రంలో భగంగా ఇవాళ కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తివారితో పవన్ మాట్లడబోతున్నారు. 


ఈ యాత్ర కోసం అంబులెన్స్ ను సిద్ధం చేసింది జనసేన. పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్రను జనహిత పేరుతో అంబులెన్సు వాహనం అనుసరించనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 8 గంటల లైఫ్ సపోర్ట్ తో వెంటిలేటర్, మోనిటర్ తోపాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లూ జనహితలో ఉన్నాయి. అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉంచారు. 


జనహిత (వారాహి అంబులెన్స్)ను డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం పర్యవేక్షించనున్నారు. వారాహి వెనుకనే వచ్చే ఈ జనహిత అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్సు, డ్రైవర్ ఉంటారు. జనహిత అంబులెన్సును మంగళగిరి పార్టీ కేంద్ర  కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంబులెన్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్సు పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మణరావు చిట్టెంతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకుని, అభినందించారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ.. "వారాహి యాత్రలో అంబులెన్సు అవసరమే రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం" అన్నారు.


వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్


14 జూన్ 2023 – కత్తిపూడి సభ 


16 జూన్ 2023 – పిఠాపురం వారాహి యాత్ర సభ 


18 జూన్ 2023 – కాకినాడల వారాహి యాత్ర సభ 


20 జూన్ 2023 – ముమ్మిడివరంవారాహి యాత్ర సభ 


21 జూన్ 2023 – అమలాపురం వారాహి యాత్ర సభ 


22 జూన్ 2023 - పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర మలికిపురంలో సభ 


23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర సభ