Janasena NRI Wing: భారత దేశాన్ని వదిలి వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐ ల కోసం జనసేన పార్టీ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. విదేశాల్లో ఉంటున్నా భారతీయ మూలాలను సజీవంగా నిలుపుకుంటున్న వారి కోసం ఈ వేదికను తీసుకొచ్చింది జనసేన పార్టీ. స్వతంత్ర సమరయోధుడు అయిన అరబిందో పేరు మీదుగా ఈ వేదికకు నామకరణం చేసింది జనసేన. 'శ్రీ అరబిందో విశ్వ వీణ'(Sri Aurobindo Viswa Veena - SAVVE) గా పేరు పెట్టింది. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ముఖ్యంగా తెలుగు వారి కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మస్తిష్కం నుంచి ఈ విశ్వ వేదిక రూపుదిద్దుకున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
'భారత దేశం అపార విజ్ఞానానికి, మనో వికాసానికి తరగని నిధి. ఈ పుణ్య భూమిపై పుట్టిన బిడ్డలు విదేశాలకు వెళ్లి అక్కడ సంపదను సృష్టించడమే కాకుండా జీవిత సాఫల్యాన్ని విదేశీయులకు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎందరో భారత దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు. భారతీయ మూలాలను సజీవంగా నిలుపుకుంటున్నారు. అటువంటి వారందరి కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్నదే "శ్రీ అరబిందో విశ్వ వీణ" (SRI AUROBINDO VISWA VEENA - "SAVVE"). శ్రీ అరబిందో, మహాకవి శ్రీశ్రీ స్ఫూర్తిగా SAVVE అని పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. విదేశాలలో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మస్తిష్కం నుంచి రూపుదిద్దుకున్నదే SAVVE.
20 ఏళ్ల ప్రాయం వరకు ఇంగ్లండ్ లోనే జీవించి అక్కడే విద్యార్జన చేసి తిరిగి భారత దేశానికి వచ్చిన శ్రీ అరబిందో.. భారత దేశాన్ని పరాయి పాలకుల పాలన నుంచి విడిపించటానికి సంగ్రామం ఒనరించిన గొప్ప స్వాతంత్ర యోధుడు. ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) వంటి ఉన్నత చదువులు చదివి పరాయి పాలకులు ఇచ్చిన ఐసీఎస్ పట్టాను త్యజించిన దేశ భక్తుడు శ్రీ అరబిందో. బ్రిటీష్ సేనల నుంచి తప్పించుకోవడానికి ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న పాండిచ్చేరికి తరలిపోయి పోరాటాన్ని ఒనరించిన యోధుడాయన. భారతీయ తాత్విక ఆధ్యాత్మిక చింతన.. సనాతన ధర్మం పట్ల చెదురులేని అనురక్తి కలిగిన శ్రీ అరబిందో ఒక నాటికి భారత దేశం విశ్వానికి గురువుగా మారుతుందని, ప్రపంచానికి మార్గదర్శిగా వెలుగొందుతుందని.. ఊహించిన గొప్ప దార్శనీకుడు. అదే విధంగా మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గురించి తెలియని తెలుగు వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అక్షరాలనే ఆయుధాలుగా మార్చుకుని కార్మిక, కర్షక, అణగారిన వర్గాల కోసం పోరాటం సలిపిన అక్షర యోధుడు. నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను అంటూ అక్షర ఆయుధాలు అందించి విశ్వానికి పయనమైన మహా కవి శ్రీశ్రీ. వీరి స్ఫూర్తితో ఏర్పాటవుతున్నదే SAVVE. భారతీయ విశిష్టతను విదేశాలలో చాటి చెప్పడంతో పాటు విదేశాలలో స్థిరపడిన (ఎన్ఆర్ఐ) వారందరికీ ఒక విశ్వ వేదిక ఈ SAVVE. ఎన్ఆర్ఐ లందరికీ SAVVE సాదరంగా ఆహ్వానం పలుకుతోంది' అంటూ ప్రకటనలో పేర్కొంది జనసేన పార్టీ