BRS Politics : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయల ఆలోచనలు ఇప్పటివి కావు.  తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. చక్రం తిప్పాలని చాలా ప్రయత్నాలు చేశారు. 2018 ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చాలా రాష్ట్రాలు తిరిగారు. 2018 ఎన్నిక్లలో గెలిచిన తర్వాత కూడా  వెళ్లి వచ్చారు. ఇక సమయం కలిసి వచ్చిందని.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన తర్వాత పార్టీ కోసం సొంత విమానం కొని ఆయన విస్తృత పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో ఆయనతో చాలా మంది కలసి వచ్చారు. అలాంటి పార్టీలను ఇప్పుడు కేసీఆర్ పట్టించుకోడం లేదు. దీంతో ఎంతో కష్టపడి దగ్గరకు చేసుకున్న మిత్రులు దూరమైపోతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. పట్టించుకోవడం లేదు. తాజాగా జేడీఎస్ .. బీఆర్ఎస్ నుంచి  పూర్తిగా దూరమైనట్లుగా కనిపిస్తోంది. 


కేసీఆర్‌ను పెద్దన్నగా భావించిన కుమారస్వామి 


కేసీఆర్, కుమారస్వామి మధ్య స్నేహం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌‌గా మార్చే ప్రకటన మొదలు.. వరుసగా పలు సందర్భాల్లో కేసీఆర్‌‌‌‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పేరును ప్రకటించినప్పుడు, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తూ కేసీఆర్ సంతకం చేసినప్పుడు కుమారస్వామి ఆయన పక్కనే ఉన్నారు. కర్నాటకలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని నాడు కేసీఆర్ అన్నారు. అక్కడి ప్రచారానికి తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను పంపుతామని చెప్పారు. కర్నాటక ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి తమ పార్టీ పని చేస్తుందని కుమారస్వామి చెప్పుకొచ్చారు. తర్వాత ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామి హాజరయ్యారు. కానీ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు కుమారస్వామి రాలేదు.అప్పట్నుంచీ ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది. కానీ  ఈ వార్తలను ఖండించిన కుమారస్వామి.. ఉత్తర కర్నాటకలో రాజకీయ రథయాత్ర చేస్తున్నందున రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు. తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత మళ్లీ కలిసింది లేదు. 


కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి జేడీఎస్ హాజరు 


కారణం ఏదైనా.. జేడీఎస్ కర్ణాటక ఎన్నికల్లో అనుకున్నంతగా విజయం సాధించలేదు. డబ్బులు లేక పాతిక సీట్లలో నెగ్గలేకపోయామని కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు .  ఆ అసంతృప్తి కేసీఆర్ మీదేనని.. ఆర్థిక సాయం చేస్తానని చేయలేదన్న అభిప్రాయాలు కర్ణాటక రాజకీయాల్లో వినిపించాయి. ఇప్పుడు జేడీఎస్ బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు .. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి గైర్హాజర్ అయితే..  జేడీఎస్ సుప్రిమో దేవేగౌడ మాత్రం హాజరయ్యారు. దీంతో కేసీఆర్‌కు ఇక జేడీఎస్ పూర్తిగా దూరమైనట్లేనని రాజకీయవర్గాలు అంచనాకు వచ్చాయి. 


బీఆర్ఎస్, జేడీఎస్ మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది ? 


ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్, కుమారస్వామి మధ్య కర్నాటక ఎన్నికలపై చర్చ జరిగిందని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇద్దరి మధ్య గ్యాప్​ పెంచాయని భావిస్తున్నారు.  జేడీఎస్‌‌తో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ అనుకుంది. కానీ టిక్కెట్లు కేటాయించేందుకు కుమారస్వామి నిరాకరించారు.  దీంతో కుమారస్వామి మద్దతు లేకుండా పోటీ చేయటం కంటే సైలెంట్​గా ఉండటమే బెటర్ అని బీఆర్ఎస్ భావించిందని. టిక్కెట్లు కేటాయించకపోవడం వల్లనే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని అంటున్నారు. ఈ అసంతృప్తి కారణంగానే జేడీఎస్‌కు ఎలాంటి సాయం కేసీఆర్ చేయలేదనిఅంటున్నారు. ఈ కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని అంటున్నారు.  


కారణం ఏదైనా కుమారస్వామితో కలిసి ..బీఆర్ఎస్‌ పయనం ఉండేలా చేసేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఇప్పుడు నిష్ఫ్రయోజనం అయ్యాయి.అయితే కేసీఆర్  కూడా ఇప్పుడు జేడీఎస్‌తో మళ్లీ సంబంధాలు పెంచుకోవాలని అనుకోవడం లేదు.ల అదే కీలకం.