AP Cabinet Meeting :   ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మొదటి రోజు నీతి ఆయోగ్ సమావేశం, రెండో రోజు  పార్లమెంట్ భవన ప్రారంభోత్సవలో పాల్గొన్నారు. మూడో రోజు సోమవారం  ఆయన అధికారికంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారో స్పష్టత లేదు కానీ.. ప్రభుత్వ వర్గాల నుంచి ఏడో తేదీన కేబినెట్ భేటీ అనే సమావేశం అనే సమాచారం మాత్రం బయటకు వచ్చింది. సీఎం  జఘన్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే హడావుడిగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది. కీలక నిర్ణయాలు అంటే.. పథకాల గురించి.. వాటి అమలు గురించి ఇప్పటికి ఏ నిర్ణయం తీసుకున్నా కీలకం కాదు. కీలక నిర్ణయమంటే ముందస్తు ఎన్నికలే. 


కొంత కాలంగా ముందస్తు ఎన్నికలపై ఏపీలో చర్చ !


ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. ఇందు కోసం సమీక్షలు చేస్తోంది. కావాల్సిన సమాచారం సేకరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు ఎందుకు సన్నాహాలు అనే అనుమానం చాలా మందికి వచ్చింది.దీంతో ఎక్కువ మంది జగన్ .. తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది.  నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అదీ కూడా మొదటి వారంలోనే వస్తుంది. అంటే.. ఎన్నికల సంఘం ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలంటే… కనీసం నాలుగైదు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేయాలి.   లేకపోతే ఈసీ సన్నాహాల కోసం మరికొంత సమయం తీసుకుంటుంది. అంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. 


ఢిల్లీలో కేంద్రం నుంచి భరోసా పొందారా ?


ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ ఆయనకు ఈ అంశంపై స్పష్టత రావడంతో ఏడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహణకు  సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  


ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడానిిక చాలా కారణాలు


ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్థిక పరిస్థితులు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి ఆరు నెలల వరకే వస్తుంది. ఆ తర్వాత కష్టం. నిధుల సమీకరణ ఇబ్బంది అవుంది.ఈ ఆరు నెలల పాటు పథకాలన్నీ అమలు చేయడానికి కావాల్సిన నిధులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో విపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. మహానాడులో అనూహ్యంగా ఆరు పథకాలను చంద్రబాబు ప్రకటించడంతో  ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లయింది. అయితే పొత్తులు ఇతర విషయాల్లో విపక్షాలు ముందడుగు వేయలేదు. వారు సన్నాహాలు పూర్తి చేయక ముందే ఎన్నికలు పూర్తి చేస్తే మేలని జగన్ భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ముందస్తుకు వెళ్తారా లేదా అన్నదానిపై ఏడో తేదీన కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.