Revanth Reddy Politics :    తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి తనను కార్నర్ చేస్తున్న  రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. అవును చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపించారు.. అయితే ఏంటి ? అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోకి కోడలిగా వచ్చానని.. పార్టీని అధికారంలోకి తెచ్చి పెడతానని ఆయన మునుగోడులో చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది.  చాలా కాలంగా విపక్ష పార్టీల నేతలు రేవంత్ రెడ్డిని చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారని విమర్శిస్తూ ఉంటారు.  ఇలాంటి వాళ్లకు ఎదురుదాడే సమాధానం అవడంతో పాటు... మరో రాజకీయ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 


టీడీపీ సానుభూతిపరుల ఓట్లు బీజేపీకి వెళ్లకుండా ప్లానా ? 


ఇటీవలి కాలంలో తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంక్.. కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని... చంద్రబాబుతో  అవగాహన కుదుర్చుకునే ప్రయత్నంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా  ఆ పార్టీకి మిగిలిన  సానుభూతిపరులు ఆ పార్టీకి ఓటు వేయకుండా తమకే వేయాలంటూ ఇతర పార్టీలం ప్రచారం చేసుకునేందుకు ఫ్లాట్ ఫాం రెడీ చేసుకుంటున్నాయి.   తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే టీడీపీ ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఇతర పార్టీల నేతలు అందుకే ఆయనను చంద్రబాబు ఏజెంట్ అన్నా రేవంత్ .. ఒప్పుకుంటున్నారు.  ఈ కారణంగా కొంత వరకూ రేవంత్ రెడ్డిపై సానుకూలత ఉంది.  దీన్ని ఆయన ఓట్లుగా మల్చుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు. 


రేవంత్ రెడ్డిపై టీడీపీ సానుభూతిపరుల్లో సానుకూలత ! 


 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా టీడీపీ క్యాడర్‌లో ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. కేసీఆర్ ను ఢీకొట్టగలిగే నేత ఆయనొక్కడే అని నమ్ముతారు. అదే  సమయంలో చంద్రబాబును ఇప్పటికీ అభిమానిస్తారు. ఎలాంటి విమర్శలు చేయరు. ఇది కూడా ఆయనపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కారణం అయింది.  చంద్రబాబుపై రేవంత్ ఎలాంటి విమర్శలు చేయకపోవడానికి తెలంగాణలో  టీడీపీ క్యాడర్ అభిమానం పొందడానికి వేసిన స్కెచ్ అనే అభిప్రాయం ఎప్పటి నుండో ఉంది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి విపక్షాల విమర్శలకు రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో టీడీపీ ఫ్యాన్స్‌లో చీలిక తెచ్చి తన వైపు కొంతమందిని ఉంచుకోగలిగేలా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.


బీజేపీ వైపు పూర్తిగా టీడీపీ సానుభూతిపరులు మళ్లకుండా ప్లాన్ ! 


రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ లో పుట్టి పెరగకపోయినప్పటికీ...  తాను కోడలిగా వచ్చానని.. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అలాగే వెళ్లి టీడీపీ గౌరవాన్ని నిలబెట్టారని.. తాను అలా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి కాంగ్రెస్‌కి అధికారాన్ని తెచ్చి పెడతానని సవాల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్‌కు లోటు లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారో అంత రాటుదేలిపోయారు. దేన్నైనా డైరక్ట్‌గా ఎదుర్కొంటున్నారు.  రాజకీయాల్లో వ్యూహాప్రతివ్యూహాలే కాదు.. ఎదురుదాడి కూడా కీలకమే. ఇప్పుడు కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి మాత్రమే ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఆ బాధ్యతను తీసుకుని శక్తివంచన లేకుండా ప్రయత్నించేందుకు రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. 


ఎలా చూసినా తెలంగాణ రాజకీయాల్లో ఈ సారి టీడీపీ సానుభూతిపరులు.. కీలకం అనే భావన ఉంది. వారిని ఆకట్టుకోవడానికే అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ ఓ అడుగు ముందుకేశారు అంతే.