Delimitation Bill 2026: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా ఆమోదించుకొని చరిత్ర సృష్టించాలని కేంద్రం చూస్తుంది. పనిలో పనిగా జమ్ము కశ్మీర్ విషయంలో కూడా అత్యంత కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకోనుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే దశాబ్దాల నాటి వాదనను చట్టబద్ధంగా మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకుంటోంది.
డీలిమిటేషన్ బిల్లు పీవోజేకేపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డీలిమిటేషన్ బిల్లులో అత్యంత ప్రధానమైన అంశం పాక్ ఆక్రమిత కశ్మీర్ నియోజకవర్గాలకు సంబంధించి కీలక ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ భూభాగాలు ఎప్పుడైతే విముక్తి పొందుతాయో అప్పుడే ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని ఈ బిల్లు భారత ఎన్నికల కమిషన్‌కు కట్టబెడుతోంది.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ బిల్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ తక్షణమే ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వదు. ఇది ఒక భవిష్యత్ కార్యాచరణ. ఆ భూభాగం తిరిగి భారత్ ఆధీనంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన వెసులుబాటును ముందుగానే కల్పిస్తోంది.
అసెంబ్లీ స్థానాలు 90 నుంచి 114కు పెంపు
ఈ బిల్లుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సవరణల ప్రకారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నిర్మాణంలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 114 కు పెరుగుతుంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం 24 స్థానాలను ఖాళీగా ఉంచుతున్నారు. ఈ స్థానాల వల్ల ప్రస్తుతం భారత్ పరిపాలనలో ఉన్న ప్రాంతాల ఓటింగ్ శక్తికి ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్ నుంచి లోక్ స్థానాల సంఖ్యను ప్రస్తుతం 5 నుంచి 7కు పెంచే అవకాశం ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యేల సంఖ్యను ఐదు నుంచి 7కు పెంచరు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు కశ్మీరీ వలసదారులు, ఒకరు పాక్ ఆక్రమిత కశ్మీర్ శరణార్థి అయ్యి ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఈ నామినేషన్లు చేసే అధికారం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సభ్యుల సంఖ్యను రెండు నుంచి మూడుకి పెంచే ప్రక్రియ నియోజకవర్గాల సర్దుబాటు తర్వాతే అమలులోకి వస్తుంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకుంటామని గతంలోనే ప్రకటించిన నేతలు
ఈ బిల్లు రాజకీయ, వ్యూహాత్మక ఎత్తుగడ వెనుక చాలా పెద్ద కథనే ఉంది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో అనేక సార్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ ప్రాంత ప్రజలే పాకిస్తాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఎటువంటి బలప్రయోగం లేకుండానే ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి పొందుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అంతర్జాతీయ వేదికలపై ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని పలుమార్లు నొక్కి చెప్పారు. ఏదో ఒక రోజు భారత్ పూర్తి అధికారాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు వచ్చిన డీలిమిటేషన్ బిల్లు 2026 ఆ ఆశయాలకు ఒక చట్టపరమైన రూపంగా కనిపిస్తోంది.
