తెలంగాణలో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల హడావుడి కొనసాగుతోంది. ఓ వైపు బీజేపీని ఇరుకున పెట్టేందుకు అధికారపార్టీ సిట్‌తోపాటు రాష్ట్ర ఐటీ, ఏసీబీ సంస్థలను రంగంలోకి దిపింది. ఇక కారుకి కళ్లెం వేయాలన్న కసితో బీజేపీ కూడా సీబీఐ, ఈడీ, ఐటీలతో దాడులకు దిగుతోంది. 


మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వీరు వారు అని లేదు టీఆర్‌ఎస్‌ నేతలందరినీ ఉరుకులు-పరుగులు పెట్టిస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కడో ఢిల్లీ లిక్కర్‌ స్కాంకి తెలంగాణకి లింక్‌ కుదరడం అందులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం. మొన్నటివరకు మాటలతోనే సాగిన బీజేపీ-టీఆర్‌ఎస్‌ వార్‌ ఇప్పుడు కేసులు, అరెస్ట్‌ల వరకు వచ్చింది. లిక్కర్‌ స్కాంలో సీబీఐ కవిత పేరు కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పేరుని ఈడీ ప్రస్తావించడంతో తెలంగాణలో రాజకీయ యుద్ధం ఉద్రిక్తంగా మారింది. 


తాజాగా  కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు. తాజాగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణకు హైదరాబాద్ లేదా ఢిల్లీని ఎంచుకోమని చెప్పారు. దీంతో కవిత హైదరాబాద్‌లోని తన నివాసలోనే సిబిఐ విచారణకు అంగీకరించారు. సిబిఐ నోటీసుల విషయాన్ని కవితే స్వయంగా మీడియాకు వెల్లడించారు. దీంతో ఈ నెల 6న సిబిఐ అధికారులు కవితను రోడ్ నెం. 14లోని ఆమె నివాసంలో విచారించనున్నారు. 


కవితనే ఎందుకు టార్గెట్‌ చేశారు ?


అసలు కవితనే ఎందుకు టార్గెట్‌ చేశారు? కెసిఆర్‌ కూతురిని అవినీతి కేసులో జైలుకి పంపితే ఎవరికి లాభం? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లోనే సామాన్యుల్లోనూ చర్చకి దారితీస్తోంది. కెసిఆర్‌ కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన కవిత ఎమ్మెల్సీ కాకముందు గతంలో ఎంపీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో బీజేపీతో టీఆర్‌ఎస్‌ మంచి సంబంధాలే కొనసాగించింది. ఆ టైమ్‌లో ఎంపీగా ఉన్న కవిత కాషాయం నేతలతోపాటు పార్లమెంటులోని అన్ని పార్టీల ఎంపీలతో కూడా సత్ససంబంధాలే కొనసాగించారు. అలా రాజకీయజీవితం సాఫీగా సాగుతున్న టైమ్‌లో రెండో దఫా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 


గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిన కవిత కొద్దిరోజులు ఇటు మీడియా అటు రాజకీయాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. పదేపదే విపక్షాలు కూతురిని గెలిపించుకోలేకపోయిన కెసిఆర్‌ అని విమర్శలు చేస్తుండటంతో ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే కవితలో ముందున్న ఉత్సాహం లేదన్న టాక్‌ ఉంది. అందుకు కారణం సొంతపార్టీ నేతలే ఓడించారన్న వార్తలే కారణమంటారు రాజకీయవిశ్లేషకులు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో తప్పించి పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కనిపించింది లేదు. 


అలాంటి కవిత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెసిఆర్‌ కుటుంబంపై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం కొత్తకాదు. ఒకప్పుడు రేవంత్‌ రెడ్డి ఇప్పుడు బీజేపీ... కల్వకుంట్ల ఫ్యామిలీ కమీషన్ల కుటుంబమని ఆరోపిస్తూనే ఉంది. మావి ఆరోపణలు కాదు నిజమని చెబుతూ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ఉండటాన్ని ప్రస్తావిస్తోంది. అయితే కెసిఆర్‌, కెటిఆర్‌, హరీశ్‌ రావుని కాకుండా కవితని ఎందుకు టార్గెట్‌ చేశారన్నది పాయింట్‌. 


కెసిఆర్‌ బలహీనత కవితని రాజకీయవర్గాల్లో చాలామందికి తెలుసు. కెసిఆర్‌పై అక్కసు ఉన్న పార్టీ నేతలే కొందరు కవితని ఎంపీగా ఓడించార్ననది కూడా బహిరంగ రహస్యమే. అలాగే ఎంపీగా ఉన్న సమయంలో సీనియర్లను పక్కన పెట్టడమే కాకుండా వారి సలహాలను కూడా పెడచెవిన పెట్టడం వల్లే ఇప్పుడు ఢిల్లీ పెద్దలు కవితని ఎరగా వేసి కెసిఆర్‌ని లొంగదీసుకోవాలనుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


కెసిఆర్‌ వ్యూహాల ముందు మోదీ-అమిత్‌ షా కాదు ఎవరైనా ఓడిపోవాల్సిందేనంటున్నారు మరికొందరు రాజకీయవిశ్లేషకులు. మునుగోడు ఉపఎన్నిక, ఎమ్మెల్యేల కోనుగోలు అంశాలు తురుపుముక్కలాంటివంటున్నారు. బీజేపీ ఎత్తులను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఈడీ-ఐటీ దాడులు రాజకీయ కుట్రలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని చెబుతూ నిధులు, ధాన్యం కోనుగోళ్లు, పంటపొలాలకు మీటర్లు, పథకాల కుదింపు వంటి వాటిని హైలెట్‌ చేస్తూ లెక్కలతో రుజువు చేస్తామని సవాళ్లు విసురుతోంది. జైలుకి కూడా వెళ్లడానికి మేము రెడీ అని స్కాం ఆరోపణలు ఎదుర్కోంటోన్న నేతలతో  చెప్పించడం ద్వారా తప్పు చేయలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం కెసిఆర్‌ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు నిగ్గు తేల్చిననిజాలు ఏమిటన్నది అందరిలో మెదలుతున్న ప్రశ్న. కోట్ల రూపాయలు, ట్రాన్సక్షన్స్, ఫోన్ ట్యాపింగ్లు, మెసేజలు, ఆడియో, వీడియో క్లిప్పులు అని నానా హడావుడి చేసిన అధికారులు చివరికి ఏం తేల్చుతారోనని అంతా ఎదురుచూస్తున్నారు.