Dasoju Sravan : కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునేందుకు.. వ్యక్తిగత ఈమేజ్ పెంచుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారంటూ దాసోజు విమర్శించారు. కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కులం, ధనం ప్రధానం అయ్యాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగతొక్కుతున్నారని ఆరోపించారు.
వ్యాపార, రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రాజకీయాలు
తన రాజీనామా విషయాన్ని ప్రకటించేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన రేవంత్ రెడ్డి తీరుపై ఘాటు విమర్శలు చేశారు. వ్యాపార, రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని దాసోజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
రేవంత్ నాయకత్వంలో పార్టీలో అరాచకం
రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. రేవంత్ తప్పు చేస్తే అడిగే వారే లేరన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు.
ఖైరతాబాద్ టిక్కెట్ దక్కనే రాజీనామా ?
కాంగ్రెస్‌లో తనకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమనే తాను నమ్ముతానని ఆయన తెలిపారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌లో పనిచేసుకుంటూ వచ్చానని అన్నారు. కానీ ఇప్పుడు భవిష్యత్ కనిపించకపోవడంతో రాజీనామా చేస్తున్నాన్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఇటీవల కాంగ్రెస్ చేరారు. ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న దాసోజు శ్రవణ్ తనకు చాన్స్ రాదని పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.