YS Jagan says Constitutional systems have collapsed in AP | రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YSRCP) శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గురువారం ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన ఆయన.. ఆ పార్టీ ముఖ్య నాయకులతోనూ సమావేశమయ్యారు. దాడులు జరిగే ప్రాంతాలకు వెళ్లి కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు జిల్లాలు వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో గవర్నర్‌ దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా ట్విట్టర్‌లో కోరిన ఆయన.. పలువురు నేతలను గవర్నర్‌ వద్దకు పంపించారు. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతుండడం, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వారి ఇళ్లకు వెళ్లి మరీ దాడులకు పాల్పడుతుండడంతో జగన్‌ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై స్పందించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు. 


 ’రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదువులకు కేంద్రలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపైనా దౌర్జన్యాలకు దిగి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.






గడిచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాలన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడు రోజుల్లోనే హింసాయుతంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్‌గారు జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’ అని ట్విట్టర్‌లో జగన్‌ పేర్కొన్నారు.