Chandrababu on Violence in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల విధ్వంసక ఘటనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (TDP Chief Chandrababu) ఆరా తీశారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొన్నిచోట్ల ఘర్షణలు, ఉద్రిక్తత చోటుచేసుకోవడంపై పార్టీ నేతల్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యలకు దిగినా.. టీడీపీ శ్రేణులు ఎలాంటి దాడులు, ప్రతి దాడులు చేయకుండా ఉండాలని చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వైసీపీ శ్రేణులు కవ్వించే ప్రయత్నం చేసినా, సంయమనం పాటించి అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొడాలి నాని ఇంటిపై దాడి - టీడీపీ రియాక్షన్ ఇదీ
గుడివాడలో కొడాలి నాని ఇంటిపై దాడి ఘటనపై టీడీపీ అధికారిక పేజీలో పార్టీ స్పందించింది. వైసీపీది ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. రోడ్డు మీద కార్లో వెళ్తూ, టిడిపి మహిళలపై గుట్కా ఊసి కారు దిగి పారిపోయిన నానిపై కోడి గుడ్లు వేసి భావ ప్రకటనా స్వేచ్ఛ తెలియజేశారని ట్వీట్ చేశారు.
వంశీ ఇంటిపై దాడి ఘటనపై టీడీపీ పోస్ట్
విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటీపై టీడీపీ గుండాల దాడి అని వైసీపీ ప్రచారం చేసింది. వంశీ ఉంటున్న అపార్ట్ మెంట్ పైకి కొందరు రాళ్లు విసరగా, మరికొందరు వాహనాలు ధ్వంసం చేశారని వైసీపీ ఓ పోస్ట్ చేసింది. దానిపై సైతం టీడీపీ అధికారిక ట్విట్టర్ లో స్పందించింది. వల్లభనేని వంశీ తన బినామీలతో నడిపించి బోర్డు తిప్పేసిన సంకల్పసిద్ధి స్కీంలో చేరి మోసపోయిన బాధితులు అలా ఇంటి ముందు నిరసనకు దిగారని టీడీపీ పేర్కొంది. ఇంటి లోపలి నుంచి వంశీ రౌడీమూకలు సంకల్పసిద్ధి బాధితులపై రాళ్లు రువ్వడంతో బాధితులు ఆ ఇంటిపై తిరిగి రాళ్ల దాడి చేశారని ఎక్స్ లో పోస్ట్ చేసింది.