Kcr Focus On Party Strengthen BRS again: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ ఏర్పాటైన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో పార్టీని పటిష్టపరిచి మరింతగా బలోపేతం చేయడంపై అధినేత కెసిఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే పార్టీ నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. కెసిఆర్ పాల్గొన్న రోడ్ షోలు, బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చారు. కానీ, ఆ స్థాయిలో ఓట్లు రాకపోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు లోక్ సభ ఎన్నికల్లో వచ్చి ఉంటే కనీసం ఐదు నుంచి ఆరు పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ కు దక్కేవని, కానీ ఆ స్థాయిలో ఓట్లు రాకపోవడం పట్ల గులాబీ బాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలపైన పార్టీ విశ్లేషిస్తోంది.
కష్ట కాలంలో ద్రోహం చేసిన వారిపై గుర్రు..
పార్టీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి, ఆర్థికంగా లబ్ధి పొందిన ఎంతో మంది నాయకులు అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. కొందరు పార్టీలో ఉన్నప్పటికీ ద్రోహం చేశారని, కొందరు పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఇతర పార్టీల్లో చేరిపోయారని, వీరు పట్ల కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ కొందరు నష్టం చేశారని, వారి వల్లే పార్లమెంటు ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు కెసిఆర్ కు తెలియజేశారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కెసిఆర్ కు పలువురు పార్టీ కీలక నాయకులు సూచించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపైన పార్టీ ముఖ్య నాయకులతో కెసిఆర్ లోతైన సమాలోచనలు జరుపుతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం.
పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే పలు వేదికల మీద పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసే విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేయడంలో అలసత్వం చేయకూడదని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని పలువురు పార్టీ ముఖ్య నాయకులు కేసిఆర్ కు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
పార్లమెంటు ఫలితాలు నేపథ్యంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపైన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దృష్టి సారించారు. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములు అనేకం చూసామని, వీటిని బేరీజు వేసుకుని ముందుకు సాగడమే తప్ప కుంగిపోకూడదని కేసీఆర్ ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.