Sonia Contesting From Khammam :  తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఆ తీర్మారాన్ని పార్టీ హైకమాండ్ కు పంపారు. అయితే పై నుంచి అలాంటి సూచనలు ఏవీ లేకపోతే ఇక్కడ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ప్లాన్ లో ఉందని అప్పుడే సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 


ఖమ్మం నుంచి సోనియా గాంధీ  పోటీ 


సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయగానే ఎక్కువ మంది  మెదక్ నుంచి అని అనుకున్నారు. తర్వాత మల్కాజిగిరి నుంచి చేయవచ్చని చెప్పుకున్నారు.  కానీ కాంగ్రెస్ ప్లాన్ భిన్నంగా ఉందని  అసలు పోటీ చేయబోసే స్థానం ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ మంది మెదక్ నుంచి పోటీ చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ మెదక్ లో  బీఆర్ఎస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెల్చుకోవడం, సిద్దిపేటలో ఆ పార్టీ భారీ మెజార్టీ సాధించే అవకాశాలు ఉండటంతో మల్కాజిగిరి సేప్ సీటన్న విశ్లేషణ ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే  మినీ  ఇండియాగా  ప్రాచుర్యం పొందిన నియోజకవర్గం మల్కాజిగిరి అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉంటారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచన వేరుగా ఉందని చెబుతున్నారు. 
 
ఖమ్మంలో కాంగ్రెస్‌కు తిరుగులేని మెజార్టీలు


ఏపీ, తెలంగాణ మధ్యలో ఉండే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం  కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఇటీవల ఎన్నికల్లో ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజవకర్గాల్లో భారీ మెజార్టీలతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కనీసం మూడు లక్షల మెజార్టీ మొత్తం మీద వచ్చింది. ముఖ్యనేతలంతా  పార్టీని వీడిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. అక్కడ అయితే రికార్డు స్థాయి విజయం లభించడమే కాదు సోనియా పోటీ చేసినందున  ఆ ఎఫెక్ట్ తెలంగాణతో పాటు.. ఏపీపైనా ఉంటుందని అంచనా  వేస్తున్నారు.  


దక్షిణాదిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి 


వచ్చే లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. దక్షిణాది నుంచి అత్యధిక సీట్లను గెల్చుకోవాలనుకుంటోంది. కర్ణాటక,తెలంగాణల్లో ఆ పార్టీ గెలవడంతో లోక్ సభ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంతో పాటు సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే తెలంగాణలో స్వీప్ చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలోనూ కొత్త ఆపరేషన్ ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఏపీ కాంగ్రెస్‌లోనూ కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.  కొంత మంది  బలమైన నేతలు వచ్చి చేరుతారని.. ఇప్పటికే ఉన్న  కొంత మంది నేతలు మరింతగా బలం పుంజుకుంటారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి..కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.