Chini as TDP candidate for Vijayawada Lok Sabha : విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు లేదని కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయానికి ముందూ వెనుకా ఏం  జరిగిందన్న  సంగతిని పక్కన పెడితే..  విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ ప్రారంభమయింది. ఎవరో కాదని  కేశినేని సోదరుడు చిన్నీకే టిక్కెట్ ఖరారు  చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సభల నిర్వహణ బాధ్యతలు కూడా ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు.  రెండు పార్లమెంటు ఎన్నికల్లో కేశినేని నాని గెలుపులో కీలక పాత్ర పోషించిన చిన్ని.. ఈ సారి అన్న స్థానంలో పోటీ చేయబోతున్నారు. కానీ అన్న మాత్రం ఈ సారి ఆయన కోసం పని చేసే అవకాశం కనిపించడం లేదు.  


రెండో సారి గెలిచిన తర్వాత సోదరుడ్ని దూరం పెట్టిన నాని 


కేశినేని శివనాథ్‌ను అందరూ కేశినేని చిన్నీ అని పిలుస్తారు. తెర వెనుక రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే కేశినేని నాని రెండో సారి గెలిచిన తర్వాత సోదరుడ్ని దూరం పెట్టారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కేశినేని  నాని ప్రస్తుతం గుడివాడ ఇంచార్జ్ గా ఉన్న  వెనిగండ్ల రాము మంచి  స్నేహితులు. ఈ క్రమంలో కేశినేని నాని ఎంపీ అనే పేరును ఉపయోగించుకుని తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కేశినేని చిన్ని పలు వివాదాల్లో జోక్యం చేసుకోవటం, అందుకు కేశినేని నాని పేరును వాడుకోవటంపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. అక్కడి నుంచే సోదరుడితో సంబంధాలు కట్ చేసుకున్నారు..  తనను పార్టీలో వ్యతిరేకించిన బుద్దా వెంకన్న వర్గాన్ని కేశినేని చిన్ని వెనకేసుకురావటం కూడా నానికి మింగుడుపడని అంశంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కు సూటిగా వ్యవహరించే కేశినేని నాని తనకు వ్యతిరేకంగా వ్యవహరించి, తన పేరును దుర్వినియోగం చేసిన చిన్నిని పక్కన పెట్టారని అంటున్నారు.


ఓ సారి పోలీసులకూ ఫిర్యాదు చేసిన నాని 
 
తన పార్లమెంట్ సభ్యుడి స్టిక్కర్ ను వేసుకొని దుర్వినియోగం చేస్తున్నారంటూ, ఎకంగా కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని పైనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకం రేపింది. తన అనుమతి లేకుండా, తనకు పార్లమెంట్ అధికారులు కేటాయించిన కారు స్టిక్కర్ ను ఫోర్జరీ చేసి వాడుకుంటున్నారని, పోలీసులకు ఎంపీ నాని ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ కూడా చేపట్టారు. దీంతో ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యవహరం వెలుగు లోకి వచ్చింది. ఎంపీ కేశినేని నాని తన కుమార్తె వివాహం చేసినప్పటికి ఆ కార్యక్రమానికి కూడ కేశినేని చిన్నిని ఆహ్వనించలేదు. రాజకీయంగా విభేదాలు ఉంటే, వాటిని ఇంటి బయటే పెట్టి పని చేసే నాయకులు ఉంటారు. కాని రాజకీయంగా వచ్చిన విభేదాలు నేపథ్యంలో కుటుంబ కార్యక్రమాలకు కూడా చిన్నిని నాని కుటుంబం ఆహ్వానించలేదు. అంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్దాయిలో ఉన్నాయో అర్దం అవుతుంది.


హైకమాండ్‌కు దగ్గరైన చిన్ని


రాజకీయంగా ఎదగాలనుకుంటున్న కేశినేని  చిన్ని.. మెల్లగా టీడీపీ హైకమాండ్ దగ్గర పరపతి సాధించారు. నారా లోకేష్ ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు. మెల్లగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆయన ప్రభావాన్ని పెంచుకుంటూ పోయారు. చివరికి ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినట్లుగా మీడియాలో వచ్చేలా చూశారు. ఆ తర్వాత బహిరంగసభల బాధ్యతలు కూడా ఇచ్చారు. దీంతో ఆయనకే టిక్కెట్ అని తేలిపోయింది. ఈ క్రమంలో కేశినేని నానికి ముందుగానే టిక్కెట్ లేదని తేల్చేసారు.