Telangana Congress : రాజకీయాల్లో పార్టీ గెలుస్తుంది అనే మూమెంట్ తెచ్చుకోవాలంటే ముందుగా ఆ పార్టీలో చేరికలు జరుగుతూ ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు పేరున్న నేతలు వచ్చి చేరుతూ ఉంటే.. గెలిచే పార్టీ అన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది. గత కొన్నాళ్లుగా ఈ అడ్వాంటేజ్ ఎక్కువగా భారత రాష్ట్ర సమితి పార్టీకి ఉంది. చేరే వాళ్లు ఎవరైనా ఉంటే ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలో చేరేవారు. కానీ ఆ ఒరవడిని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే తెలంగాణలో ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందనే ప్రచారం ముంచు నుంచీ జరగడం.. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి ఆ అడ్వాంటేజ్ ను గరిష్ఠ స్థాయిలో వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల్ని పేర్లు పెట్టి మరీ పిలిచి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
రేవంత్ పిలుస్తున్న నేతలంతా బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్న వాళ్లే !
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్లాన్డ్ గా కొంత మంది పేర్లు పెట్టి మరీ పార్టీలోకి రావాలని అడుగుతున్నారు. వారిలో ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , కేపీ వివేక్ వంటి వారు ఉన్నారు. వీరంతా బీజేపీ నేతలు. అంతే కాదు. ఇటీవలి కాలంలో వీరంతా బీజేపీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తికి గురవుతున్న వాళ్లేనన్న ప్రచారం ఉంది. ఈటల రాజేందర్ చాలా కాలం నుంచి బీజేపీలో సైలెంట్ గా ఉండాల్సి వస్తోంది. ఆయనను టీ బీజేపీ అధ్యక్షుడిని చేస్తారని అనుకున్నారు కానీ అలాంటి చాన్స్ లేదనే సంకేతాలు రావడంతో ఆయన తీవ్ర నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఇక కేపీ వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదట్లో యాక్టివ్ గా ఉండేవారు. ఇటీవల ఎక్కడైనా కనిపించడం గగనం అయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నియోజవకర్గంలో అమిత్ షాతో సభ నిర్వహించారు. కానీ ఆయన బీజేపీ విషయంలో ఎంత చురుగ్గా ఉన్నారో అంచనా వేయడం కష్టం. వివేక్.. తనకు ప్రాధాన్యత విషయంలో అంత సంతృప్తిగా లేరని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ వ్యతిరేకత ఆధారంగానే రేవంత్ రాజకయం !
రేవంత్ రెడ్డి వ్యూహాత్కక రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవడం.. పదవులు పొందడం కాదు ముందు కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేద్దామని కలిసి రమ్మని పిలుపునిస్తున్నారు. అంతా కేసీఆర్ బాధితులే కావడంతో ఆ వైపు నుంచి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే కేసీఆర్ ను ఎవరు ఓడించగలరో ఆ పార్టీలోనే చేరుతానని చెబుతూ వచ్చారు. ఈటల లక్ష్యం కూడా కేసీఆర్ ను ఓడించడమే. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు ఆ పార్టీ ఎంతో కొంత రేసులోకి వస్తుందని నమ్మకం పెట్టుకోలేకపోయారు. కానీ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితి మారిందని నమ్ముతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ప్రజల్లో మార్ప కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ కు రెండు సార్లు చాన్సిచ్చాం కదా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ సారి అవకాశం ఇద్దాం అనే భావన ప్రజల్లో వస్తే.. . ఎన్నికలు ఏకపక్షంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజల్లో అలాంటి భావన రావాలంటే కాంగ్రెస్ బలంగా ఉందని..గెలుస్తుందన్న నమ్మకం రావాలి. అలాంటి భావన రావాలంటే రికలు పెరగాలి. అందుకే రేవంత్.. కేసీఆర్ ను ఓడిద్దాం రమ్మని పిలుస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఖండించిన ముందు ముందు కాంగ్రెస్ లో చేరికలు ?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరాలా అని చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఖమ్మంలో బీజేపీకి అసలు క్యాడరే లేరని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా వారు కాంగ్రెస్ లోకే వస్తారని నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు తాను పిలుస్తున్న ముఖ్య నేతల్లోనూ కొంత మంది ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్‌లకే టిక్కెట్లు అని ప్రకటిస్తే... పలు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపే చూస్తారు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారు. వారు సైలెంట్ గా ఉండరు. వేరే పార్టీల్లో చేరిపోతారు. బీజేపీ తట్టుకోలేదు అన్న పరిస్థితి కనిపిస్తే.. బలమైన నేతలూ కాంగ్రెస్ వైపే చూస్తారు. అందుకే రేవంత్ ముందు నుంచీ.. కాంగ్రెస్ ఉంది అనే భావన వారిలో నెలకొల్పుతున్నారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది.