Vijayasai Reddy In Rajya Sabha: న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్లాన్ చేసిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కానీ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి, ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రెండు ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్, అతికష్టమ్మీద మూడో ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. 


విభజన చట్టంలో హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదు!
ఇప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కొన్ని రోజులు వేచి చూస్తే చాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా.. విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో నష్టపోయారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించింది, కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక రాకపోవడానికి కారణం ఆ పార్టీ పెద్దలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్‌తో ఏపీకి తీరని నష్టం.. 
 ఏపీ విభజన అసంబద్ధంగా, అసంపూర్తిగా జరిగిందని.. దాంతో తమ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారను కనుక.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని, అభివృద్ధి జరగదని విమర్శించారు.               


కాంగ్రెస్ పార్టీ ఏపీకి చేసిన నష్టం కారణంగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు శిక్షలు పడుతూనే ఉంటాయని, రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని, విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీలో అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీ, త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గిన 40 సీట్లకు మించి గెలవదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన విషయాలను విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.