Minister Sidiri Appalaraju is likely to Contest From to Visakhapatnam South : ఏపీలో మంత్రుల సీట్లకూ సీఎం జగన్  క్లారిటీ ఇవ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి   సీదిరి అప్పలరాజుకూ టిక్కెట్ ఖరారు కాలేదు.  సీదిరి అప్పలరాజును రానున్న ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి  పోటీకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  విశాఖ సౌత్ లో వైసీపీ  రెండు వర్గాలు ఏర్పడడంవల్ల పార్టీ నష్టం వాటిల్లుతున్న దృష్ట్యా మద్యే మార్గంగా అక్కడ కొత్త వారిని దింపాలని వైకాపా పెద్దలు సమాలోచనలు సాగిస్తున్నట్లుగాప్రచారం నడుస్తోంది. మత్స్యకార సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఆనియోజకవర్గంలో ఉండడంతో మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజును పోటీకి పెడితే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


భీమిలి నుంచి అవకాశం కోరుతున్న అప్పలరాజు 


పలాస నుంచి మార్పు ఖాయమని వైకాపా పెద్దలు రాష్ట్ర మంత్రి సీదిరితో చర్చించారని అంటున్నారు. ఆయన భీమిలీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారని, లేని పక్షంలో ఇచ్చాపురం నుంచి తన పేరును పరిశీలించాలని కోరినట్లుగా తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యంగా ఆయన పలాసనే కోరుకుంటున్నారు.  పలాస నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాళింగ సామాజిక వర్గానికిచెందిన ఆయన పేరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్ధులఎంపిక సమయంలో పరిశీలనకి వచ్చినా రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ను చివరిగా వైకాపా ఎంపిక చేసింది. ఈ తరుణంలో డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్ పలాస నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వైకాపా పెద్దలను కోరుతున్నట్లుగా చర్చ జరుగుతుంది. సిఎంఓ వర్గాల నుంచి ఆయన పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈ విషయం  సీదిరి అప్పలరాజు వర్గీయులకి తెలియడంతో వారు సీటును నిలుపుకునే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.


అప్పలరాజుకు కాకుండా ఎవరికి ఇచ్చిన ఓటమేనని ఆయన వర్గీయుల హెచ్చరికలు


కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పలాసలో వైకాపా టిక్కెట్ ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని డా.సీదిరి అప్పలరాజు వర్గీయులు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.  పలాస నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం అగ్నికుల క్షత్రియులని ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వకపోతే వైకాపా పలాసలో ఓటమి చవిచెందడం ఖాయమని వారు చెబుతున్నారు. కేవలం పలాసలోనే కాదని డివిజన్ లో మొత్తం వైకాపా నష్టపోతుందని,కావాలంటే రాసిపెట్టుకోవాలని కూడా సీదిరి వర్గీయులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎప్పుడు దూకుడుగా ఉంటుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ ఇది వరకటి స్పీడ్ ఆయనలో కన్పించడం లేదని పలాస వాసులు అభిప్రాయపడుతున్నారు. 


దూకుడు తగ్గించిన అప్పలరాజు 


పలాస నుంచి స్థాన చలనం తప్పదని అధిష్టానం సంకేతాలు ఇవ్వడం వల్లనే ఆయన తీరులో ఈ మార్పు వచ్చి ఉంటుందని వారంతా కూడా భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన తన ముఖ్యఅనుచరులతో సమావేశం నిర్వహించి పలాస నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజునే బరిలో నిలపాలని అధిష్టానాన్ని కోరాలని వారికి దిశా నిర్దేశం చేసినట్లుగా కూడా ఆ ప్రాంతంలో టాక్ నడుస్తోంది. పలాస నియోజకవర్గ వైకాపా నేతలు ఎవరికి తోచిన విదంగా వారు మాట్లాడుతున్నారు. అయితే మొదట నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో నడుస్తున్న నమ్మకస్తులైతే పలాస నుంచే డాక్టర్ సీదిరి అప్పలరాజు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, ఈ ప్రచారాలలో వాస్తవం లేదని కొట్టి పారేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మరో సారి పలాసలో డాక్టర్ సీదిరి అప్పలరాజు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.