తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ( Revant Reddy ) ఓ రకంగా తిరుగుబాటు చేశారు. తనపై కోవర్ట్ ముద్ర వేసింది ఆయన అనుచరులేనని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తర్వాత ఇప్పుడే కాదన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ( Congress Party ) ఉన్నారో లేదో ఆయన మాత్రమే చెప్పగలరు. మొత్తంగా పరిణామాలు చూస్తే జగ్గారెడ్డి హడావుడిగా ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.
జగ్గారెడ్డిని లైట్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ !
జగ్గారెడ్డి ( Jagga reddy ) మూడు రోజుల నుంచి వరుస ప్రెస్‌మీట్లతో హడావుడి చేశారు. సోనియా, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్తా లేకపోతే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటున్నారు. అయితే ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగారన్న ప్రచారం జరిగింది. కానీ టీ పీసీసీ ( T PCC ) వర్గాలు మాత్రం అదేమీ లేదని ఆయనే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు పలువుర్ని కలిశారు కానీ ఆయనను ఎవరూ బుజ్జగించడం లేదని చెబుతున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ సమస్య అని సర్దుకుంటుందని చెబుతున్నారు. కానీ ఆయనను బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎఐసీసీ ( AICC ) నుంచి కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా జగ్గారెడ్డికి రాలేదు.
కలసి రాని ఇతర అసంతృప్త సీనియర్ నేతలు !
తాను మొదలు పెడితే రేవంత్‌పై అసంతృప్తిగా ఉన్న ఇతర నేతలు కలసి వస్తారని జగ్గారెడ్డి అనుకున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌ను పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది గాంధీభవన్‌కు ( Gandhi Bhavan ) కూడా రావడం లేదు. అయినా వీరెవరూ జగ్గారెడ్డికి మద్దతు తెలియచేయలేదు. రేవంత్ కారణంగా పార్టీలో సీనియర్లు ఉండే పరిస్థితి లేదనే విధంగా సీనియర్లు బయటకు వస్తారని అనుకున్నారు. కానీ ఎవరూ రాలేదు. రేవంత్ కు వ్యతిరేకంగా తాను తప్ప ఎవరూ కోరస్ అందుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు తంటాలు పడుతున్నారు.
ఇప్పుడు జగ్గారెడ్డికి దారేది ?
ఇప్పుడు జగ్గారెడ్డి కార్నర్‌లో పడిపోయారు. ఇంత జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లో ఉండలేరు. ఉంటే నోరెత్తకూడదు. ఉంటే ఉండు.. లేకపోతే పో అన్న సందేశం ఇప్పుడు ఆయనకు వచ్చేసిటన్లయింది. ఏదో ఒకటి చెప్పుకుని కాంగ్రెస్‌లో కొనసాగడమా లేక ఇతర పార్టీల్లో చేరడమా అన్నది ఇప్పుడు జగ్గారెడ్డి ముందున్న ప్రశ్న. సొంత పార్టీ అని చెబుతున్నా అది రాజకీయంగా ఆత్మహత్యసదృశమే అని జగ్గారెడ్డికి బాగా తెలుసు. అందుకే ఆయన ఏదో ఓ పార్టీలో చేరక తప్పదంటున్నారు. అయితే ఆయన తీరు వల్ల చేర్చుకోవడానికి ఇతర పార్టీలు ఎంత వరకూ అంగీకరిస్తాయో వేచి చూడాల్సింది. మొత్తంగా మూడు రోజుల ఎపిసోడ్స్ చూస్తే జగ్గారెడ్డి పూర్తిగా సెల్ఫ్ గోల్ ( Self Goal ) చేసుకున్నారని గాంధీ భవన్ వర్గాలు నిర్ధారించేస్తున్నాయి.