Revanth Reddy Political Strategy:  తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇటీవలి కాలంలో ఒక స్పష్టమైన, వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ విమర్శల పంథాను పూర్తిగా మార్చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి , దాని అధినేత కేసీఆర్‌లను ఆయన ఇప్పుడు తక్కువగా టార్గెట్ చేస్తున్నారు. దానికి భిన్నంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై విమర్శల పదును పెంచారు.  ఎక్కడ బహిరంగ సభ జరిగినా కిషన్ రెడ్డి లక్ష్యంగా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు,  రాష్ట్రానికి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు అంటూ  ఆరో చేస్తున్నారు. 

Continues below advertisement

15వ తేదీ వరకూ కిషన్ రెడ్డికి డెడ్ లైన్ 

ఈ వ్యూహంలో భాగంగానే "ఈ నెల 15వ తేదీ తర్వాత కిషన్ రెడ్డి సంగతి చూస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తెరవెనుక ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను కాదని, కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే.. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను పూర్తిగా మూడో స్థానానికి పరిమితం చేయడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి ద్విముఖ పోరు   జరిగేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.

Continues below advertisement

యాంటీ బీజేపీ ఓట్లను పోలరైజ్ చేయాలని రేవంత్ ప్లాన్ 

 బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో   రాణించలేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ,  ఓటు బ్యాంక్ బలహీనపడింది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ను ఇంకా టార్గెట్ చేయడం వల్ల ఆ పార్టీకి అనవసర మైలేజ్ ఇచ్చినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే, క్షేత్రస్థాయిలో బలపడుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టడం ద్వారా, యాంటీ-బీజేపీ   ఓట్లన్నీ ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లు సహజంగానే కాంగ్రెస్ వైపు ఏకీకృతం  అవుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

అభివృద్ధి పనులకు తెలంగాణ సెంటిమెంట్ 

మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి  తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. మోదీ గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే కిషన్ రెడ్డి, తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం వెనుక ప్రాంతీయ సెంటిమెంట్‌ను రచ్చకెక్కించే వ్యూహం ఉంది. చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా బీజేపీ నేతలే ఉన్నా.. కేంద్రం నుండి నిధులు తేవడంలో వారు విఫలమయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, బీజేపీకి లభించిన పార్లమెంటరీ బలాన్ని రాజకీయంగా బలహీనపరచాలని రేవంత్ చూస్తున్నారు.

కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ రెడీ 

దీనికి కౌంటర్‌గా బీజేపీ సైతం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడానికే మొగ్గు చూపుతోంది. రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలను, కేంద్ర పెద్దలతో ఆయన జరిపే భేటీలను కిషన్ రెడ్డి క్షుణ్ణంగా గమనిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కూడా బీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టి, కేవలం కాంగ్రెస్ వైఫల్యాలనే ఎండగట్టడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తీ అని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంటే, ఉభయ పక్షాలు పరస్పరం లబ్ధి పొందేలా, బీఆర్‌ఎస్ ఉనికిని క్రమంగా తుడిచిపెట్టేలా ఈ  ద్విముఖ పోరు  వ్యూహానికి ఇరు పార్టీలూ సహకరించుకుంటున్నాయనే భావన వ్యక్తమవుతోంది.

 సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త రాజకీయ వ్యూహం తెలంగాణను భవిష్యత్తులో కేవలం రెండు జాతీయ పార్టీల రణరంగంగా మార్చబోతోంది. రాబోయే 24 నెలల కాలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెబుతూనే, రాజకీయంగా ప్రత్యర్థులను కోలుకోకుండా చేయడం రేవంత్ మార్క్ పాలిటిక్స్. ఈ నెల 15వ తేదీ తర్వాత ఆయన తీసుకోబోయే రాజకీయ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, .దీనిని కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశాలపైనే తెలంగాణ భవిష్యత్ రాజకీయ చిత్రం ఆధారపడి ఉంది.