YS Jagan Congress Alliance Rumours: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు ఒకదానికొకటి పెనవేసుకుని, అత్యంత ఆసక్తికరమైన చెస్ గేమ్‌ను తలపిస్తున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే  కూటమికి వ్యతిరేకంగా మెల్లగా గళం విప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  జగన్ ప్రధాని మోదీ లేదా కేంద్ర ప్రభుత్వంపై నేరుగా వ్యక్తిగత విమర్శలు చేయకుండా, కేవలం విధానపరమైన వ్యతిరేకతను మాత్రమే ప్రదర్శిస్తూ  ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కర్ణాటక   నుంచి దక్కాల్సిన రాజ్యసభ సీటు చివరి క్షణంలో సాంకేతిక, రాజకీయ కారణాల వల్ల చేజారడం గమనార్హం. ఈ పరిణామాలు ఏపీలోనే కాకుండా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ వ్యూహాల్లోనూ పెను మార్పులకు కారణమవుతున్నాయి.

Continues below advertisement

జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న రేవంత్ 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయే కూటమికి దూరంగా జరుగుతూ, లోపాయకారీగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు పంపడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కూటమిని ఒంటరిగా ఎదుర్కోవడం కంటే, జాతీయ స్థాయిలో యాంటీ-బీజేపీ శక్తులతో జతకట్టడం మేలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని పసిగట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శుక్రవారం నాటి మీడియా చిట్‌చాట్‌లో జగన్‌కు అనుకూలంగా సానుభూతి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఏపీలో జగన్ సభలకు, ర్యాలీలకు కూటమి ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోందంటూ రేవంత్ మాట్లాడటం వెనుక.. భవిష్యత్తులో జగన్ కాంగ్రెస్‌కు దగ్గరైతే తద్వారా వచ్చే పొలిటికల్ మైలేజీని ఒడిసిపట్టాలనే ముందస్తు ప్లాన్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు సమీకరణాలు కవర్ చేస్తున్న సీఎం

Continues below advertisement

 ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో నొచ్చుకున్న ఒక వర్గాన్ని శాంతపరిచేందుకే, జగన్ సభల అనుమతులపై రేవంత్ సానుభూతి అస్త్రం విసిరారనే ప్రచారం సాగుతోంది.   హైదరాబాద్ గుండెకాయ లాంటి అమీర్‌పేట్ జంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దివంగత నేత ఎన్టీ రామారావు 23 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. కాంగ్రెస్‌కు బద్ధశత్రువుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టడంపై తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఒక వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఈ చర్యతో బీఆర్ఎస్, మలిదశ ఉద్యమకారుల నుంచి రేవంత్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులను, రెడ్డి సామాజికవర్గాన్ని సమతూకం   చేయడానికి జగన్ ప్రస్తావన తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ద్వారా ఆంధ్రా సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కొల్లగొట్టడం.. అలాగే జగన్ సభలపై సానుభూతి చూపడం ద్వారా వైఎస్సార్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం రేవంత్ మార్క్ డబుల్ గేమ్ .

గ్రేటర్ ఎన్నికలతో పాటు జాతీయ సమీకరణాలు

ఈ మొత్తం పరిణామాల వెనుక ఉన్న అసలు లక్ష్యం.. త్వరలో రాబోయే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలే. హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, సెటిలర్లు గెలుపోటములను శాసిస్తారు. గతంలో ఈ ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ వైపు నిలిచింది. ఇప్పుడు కేసీఆర్ బలహీనపడటంతో ఆ ఓట్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడమే రేవంత్ రెడ్డి ఏకైక అజెండా. అందుకోసమే అటు ఎన్టీఆర్ అభిమానులను, ఇటు వైఎస్సార్ అనుచరులను ఒకేలా ప్రసన్నం చేసుకునే దిద్దుబాటు చర్యలకు  ఆయన శ్రీకారం చుట్టారని అంటున్నారు. 

జగన్‌ను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్లాన్

ఏపీలో షర్మిల రాజ్యసభ సీటు మిస్ అవ్వడం కూడా జగన్-కాంగ్రెస్ సాన్నిహిత్యానికి మార్గం సుగమం చేస్తోందనే వాదన ఉంది. ఒకవేళ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం పార్లమెంట్‌కు పంపి ఉంటే, జగన్ కాంగ్రెస్ వైపు చూడటం అసాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు మారిన సమీకరణాల్లో జగన్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, కాంగ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్‌కు సై అంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికి ఏపీలో జగన్ వేస్తున్న అడుగులు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాస్తున్న పొలిటికల్ స్క్రిప్ట్‌లు రెండూ ఒకదానికొకటి ముడిపడి సాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రేవంత్ రెడ్డి నడుపుతున్న ఈ మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.