Telangana Congress Ministers Internal Rift: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. అదే సమయంలో మంత్రులను కాదని ఇతర నేతల్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సీనియర్ మంత్రులకు గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వ్యవహారాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేయడమే కాకుండా, దిల్లీ దాకా వివాదం ముదిరేలా చేస్తున్నాయి.
బీఆర్ఎస్‌కు సవాల్ చేసి ఇరుక్కున్న జూపల్లి
ఈ వివాదాల పరంపరలో మొదటగా ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరుక్కుపోయారు. తన పరిధిలో లేని ఆర్థిక శాఖ వ్యవహారాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు సవాల్ విసిరి, తెలంగాణ భవన్‌కు వస్తానని ఛాలెంజ్ చేయడం జూపల్లికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అత్యంత తెలివిగా వాడుకుని కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఛాలెంజ్ చేసినవాడు నేరుగా చర్చకు వెళ్లి తేల్చుకోవాలి కానీ, పార్టీని ఇరకాటంలో పెట్టడం ఎందుకు అని అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు లీకులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జూపల్లి, సోమవారం సీఎం నిర్వహించిన పర్యాటక శాఖ అధికారిక సమీక్షకు కూడా డుమ్మా కొట్టి, కొల్లాపూర్ బావిలో ఈత కొడుతున్న వీడియోలు రిలీజ్ చేశారు.
మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కడియంపై అసంతృప్తి లేఖ రాసినప్పటికీ..కడియంకు సీఎం ప్రోత్సాహం ఉందని ఆమె నమ్ముతున్నారు. అదే సమయంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం వంటి అంశాల్లో కనీసం దేవాదాయ శాఖ మంత్రి అయిన తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆమె కినుక వహించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర క్యాబినెట్‌లో ఏకైక బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనను ఒకేసారి రెండు ప్రధాన అంశాల్లో టార్గెట్ చేస్తూ, తీవ్ర అవమానానికి గురిచేస్తున్నారనే భావనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ వరంగల్ రాజకీయాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, స్థానిక ఎమ్మెల్యేలతో కొండా కుటుంబానికి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా తన స్వంత శాఖలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా జోక్యం చేసుకుంటూ బోర్డులను ఖరారు చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ వరుస పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన కొండా సురేఖ.. రాష్ట్ర నాయకత్వం తీరుపై నిరసన తెలుపుతూ ఏఐసీసీ హైకమాండ్‌కు నేరుగా ఒక ఘాటు లేఖ రాయడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రేవంత్ శైలి మార్చాల్సిందేనా ?
ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సెంట్రలైజ్డ్ పవర్ శైలియేనని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలంగా ఉన్న సీనియర్ నేతలు, తాము రేవంత్ కంటే సీనియర్లమని భావించే మంత్రులు.. సీఎంవో నుంచి వచ్చే ఆదేశాలను సులభంగా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తితో ఉన్నప్పటికీ బహిర్గతం చేయడం లేదు. కానీ జూపల్లి, కొండా సురేఖలు తమ అసంతృప్తిని పరోక్షంగా, ప్రత్యక్షంగా బయటపెట్టడం చర్చనీయాంశమైంది.
సమన్వయంలోపంతో సమస్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య అంతర్గత సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదనే విషయాన్ని ఈ తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. క్యాబినెట్ సహచరులే ఇలా తిరుగుబాటు జెండా ఎగరేయడం, లేఖలు రాయడం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు సవాల్‌గా మారింది. మరి ఈ అంతర్గత చిచ్చును అధిష్ఠానం జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేస్తుందా.. లేక రాబోయే రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా అసంతృప్తులకు చెక్ పెడతారా అనేది వేచి చూడాల్సిందే.
