Congress Vs BRS On Loans: తెలంగాణ రాష్ట్ర అప్పుల లెక్కల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ రోజుకో మలుపు తిరుగుతూ హైవోల్టేజ్ వార్‌గా మారింది. గురువారం నాటి ఉత్కంఠ పరిణామాల అనంతరం, శుక్రవారం నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన తాజా సవాల్‌తో ఈ వివాదం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరింది. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్‌కు వస్తున్నా.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలి అని జూపల్లి సవాల్ విసరడమే కాకుండా, అన్నట్లుగానే చెప్పిన సమయానికి లెక్కల చిట్టాతో ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఎలా అప్పుల కుప్పగా మార్చారో ప్రజల ముందు బట్టబయలు చేస్తానంటూ ఆయన మీడియా వేదికగా గులాబీ శ్రేణులపై విరుచుకుపడ్డారు.
చెప్పినట్లుగానే ఐదు గంటలకు ప్రెస్‌క్లబ్ చేరుకున్న జూపల్లి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8.21 లక్షల కోట్ల భారీ అప్పుపై మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కనీస క్లారిటీ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు నిజంగా పౌరుషం ఉంటే తాము చేసిన తప్పులను ఒప్పుకుని, రాజకీయ రాజీనామాలకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. మాట తప్పడం మా ఇంట వంట లేదు. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో వేల కోట్లు అప్పు తెచ్చింది నిజం కాదా ఆ అప్పులను ఎలా తీరుస్తారో చెప్పమంటే సమాధానం లేదు. హరీష్ రావు రాసిన లేఖలో కేవలం సొల్లు, మాటల గారడీ తప్ప మరేమీ లేదు అని జూపల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంత్రి జూపల్లి ప్రెస్ క్లబ్‌లో ఉన్న సమయంలోనే.. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పక్కా ఆధారాలతో కూడిన ఒక సుదీర్ఘమైన కౌంటర్ లేఖను విడుదల చేసి కాంగ్రెస్ నరేటివ్‌ను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మంత్రి జూపల్లికి పంపిన లేఖలో హరీష్ రావు సంచలన అంశాలను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేళ్ల మా పాలనలో రాష్ట్ర అప్పు రూ.4,17,000 కోట్లు మాత్రమేనని ప్రకటించాను, ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా దీనిపై చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. మార్చి నెలలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ అప్పు రూ.3,47,294 కోట్లు అని చెబితే, జూపల్లి రాసిన లేఖలో మాత్రం కేవలం రూ.1,77,058 కోట్లు అని తక్కువ చేసి చూపించడాన్ని హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే వివిధ మార్గాల ద్వారా దాదాపు రూ.4,50,000 కోట్ల కొత్త అప్పులు చేసిందని ఆరోపించారు.
ఈ రాజకీయ సవాల్ల పర్వంలో ఇరు పార్టీలు సామాన్య ప్రజలను సైతం కన్ఫ్యూజ్ చేసేలా లెక్కల యుద్ధానికి తెరలేపాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అధికారిక నివేదికలను హరీష్ రావు తన లేఖకు జత చేసి జూపల్లికి పంపించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకుని వాస్తవాలు తెలుసుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. మొత్తానికి, ఒకవైపు మంత్రి జూపల్లి ప్రెస్ క్లబ్ వేదికగా లైవ్ డిబేట్‌కు కూర్చోవడం, మరోవైపు హరీష్ రావు డాక్యుమెంట్లతో కూడిన లేఖల అస్త్రాలు సంధించడంతో.. ఈ అప్పుల రాజకీయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
