CM Revanth is playing all out political game :  రాజకీయాల్లో సీనియార్టీ ముఖ్యం కాదు. రాజకీయ వ్యూహాలే ముఖ్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటి వ్యూహాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో కనిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఆయన ఒక్క ప్రెస్ మీట్  ద్వారా చెక్ పెట్టారు. అంతే కాదు అసెంబ్లీలో చర్చకు సవాల్ విసరడం ద్వారా ఆ రెండు పార్టీలకు తేల్చుకోలేని సమస్యను తెచ్చి పెట్టారు. ఎందుకంటే మూసి ప్రక్షాళనను ఆ రెండు పార్టీలు వ్యతిరేకించలేవు. మారిపోయిన రాజకీయంలో స్వాగతిస్తే రేవంత్ ట్రాప్‌లో పడినట్లు అవుతుంది. 


మూసి ప్రక్షాళనను సవాల్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి 


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మూసిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ఆయన మనసులో ఓ విజన్ ఉంది. నగరం మధ్య నుంచి పోయే మూసీ నదిని అత్యంత సుందరంగా మారిస్తే అది ఆర్థిక వాహకం కూడా అవుతుందని ఆయన అనుకున్నారు. లండన్ లోని ధేమ్స్ నదిని కూడా చూసి వచ్చారు. నగరాల నుంచి నదులు ప్రవహించే చోట్ల ఉన్న పరిస్థితుల కంటే హైదరాబాద్‌ బెటర్ పొజిషన్ లో ఉందని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే కొన్ని అధికార బృందాలకు ప్రత్యేకంగా మూసి మీద సర్వే చేసే పనులు అప్పగించారు. డీపీఆర్ రెడీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. విపక్షం రాజకీయం చేయాలని చూస్తున్నా రేవంత్ దాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.  


వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?


రేవంత్‌పై ప్రజా వ్యతిరేకత పెంచేందుకు మంచి చాన్స్ అనుకున్న విపక్షాలు 


మూసి ప్రక్షాళన అనేది అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీకి ఓ డ్రీమ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకన్నారు. కేసీఆర్ అనుకున్నారు. కానీ ఎవరూ చేయలేకపోయారు. ఎందుకంటే మూసిలో దశాబ్దాలుగా ఆక్రమణలు ఉన్నాయి. ఏకంగా కాలనీలకు కాలనీలే నిర్మాణం అయ్యాయి. వాటికి ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చాయి. కరెంట్, వాటర్ కనెక్షన్లు ఇచ్చాయి. ఇలాంటి ఆక్రమణల కారణంగా మూసీ కాస్తా మురికి కాలవ అయిపోయింది. వారందర్నీ ఖాళీ చేయించాలంటే ప్రజా వ్యతిరేకత వస్తుందని , పరిహారానికి వేల కోట్లు కేటాయించాలని ఆపేశారు. ఈ విషయాన్ని మూసి ప్రక్షాళన కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనను సీరియస్ గా తీసుకోవడంతో ఆయనపై ప్రజా వ్యతిరేకత పెంచేందుకు మంచి అవకాశం అనుకున్నాయి విపక్షాలు. హైడ్రా కూల్చివేతలు వారికి కలసి వచ్చాయి. అంతే ఒక్క ఇంటినీ కూలగొట్టనీయమని పేదలకు అండగా ఉంటామని హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ మూసీ నిర్వాసిత కాలనీల్లో పర్యటించి  భరోసా ఇచ్చారు. కావాల్సినంత రాజకీయం చేశారు.  


ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !


మూసీ రాజకీయంలో పర్‌ఫెక్ట్ పాచిక వేసిన రేవంత్ రెడ్డి 
 
ఈ రాజకీయానికి రేవంత్ పర్ ఫెక్ట్ పాచిక వేశారు. మూసీ మురికి కూపంగా ఉండటం వల్ల ఎన్ని  సమస్యలు  వస్తున్నాయో వివరించడమే కాకుండా.. ప్రజలు వద్దంటే ఆపేస్తానని అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని సభను ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెడదామన్నారు. తాను సవాల్ చేయలేదని.. సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్, బీజేపీ రియాక్ట్ కావాల్సి ఉంది. చిన్న వర్షం వస్తేనే మునిగిపోయే పరిస్థితికి వెళ్లిపోతున్న హైదరాబాద్‌కు రేపు ఏదైనా క్లౌడ్ బరస్ట్  బారిన పడితే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూసీని ప్రక్షాళన చేయాలని రేవంత్ అంటున్నారు. అవసరం లేదంటే అదే అసెంబ్లీల చెప్పాలని అంటున్నారు. అలా చెబితే హైదరాబాద్ ప్రజలు స్వాగతించే అకాశం ఉండదు. ముంచేసే సమస్య వచ్చినప్పుడు నిర్వాసితులకు న్యాయం చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవడమే కీలకం. దాన్ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో రాజకీయ నేతలకు తెలుసు. ఆ విషయాన్ని రేవంత్ గట్టిగా పట్టుకున్నారు. 


ఇప్పుడు మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే ప్రజలకు వ్యతిరేకం అవుతారు. స్వాగతిస్తే..రేవంత్ చెప్పిందే నిజమని అంగీకరించినట్లవుతుంది. అది కూడా రాజకీయంగా నష్టమే చేస్తుంది. ఇది రేవంత్ ఆల్ ఔట్ ప్లాన్ అనుకోవచ్చు.