KCR New Plan : ఎమ్మెల్యేల అవినీతి వల్ల ప్రభుత్వంపై అవినీతి మరక పడటం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు కోపం తెప్పిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికపై ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని నిర్ణయానికి వచ్చారు. జోక్యం చేసుకోవద్దని పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జి ల ద్వారా అధినేత ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. ఎమ్మెల్యేలు, నాయకులే కాదు.. పార్టీలో, ప్ర భుత్వంలో ఎంతటి స్థాయి ఉన్నవారైనా సరే రెకమండ్ చేసిన అంశాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందేనని కేసీఆర్ మౌఖికంగా ఆదేశించారు.
గతంలో ఎమ్మెల్యేల చాయిస్ మేరకు లబ్దిదారుల ఎంపిక !
లబ్దిదారుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ గతంలో ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒక్కో దళితబంధు లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారని, కొన్ని సంఘటన లను ఉటంకిస్తూ అధినేత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉండటంతో పార్టీ పరంగా కఠిన నిర్ణ యాలు తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలు్సతోంది. కొద్ది రోజులుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ స్వయం పర్యవేక్షణ మొదలుపెట్టారు. ప్రధానంగా భూ క్రమబద్దీకరణ ప్రక్రియలో ఎమ్మెల్యేల పాత్రకు బ్రేక్ వేశారని చెబుతున్నారు.
అమలు చేయబోయే పథకాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉండనట్లే !
ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ, పేదల సొంతింటికి రూ.3లక్షల నగదు పారితోషికం లాంటి సంక్షేమ పథకాలను త్వరలో ప్రభుత్వం అమలు చేయనుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదలకు నిబం ధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఆ దిశగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కొంతమంది నాయకులకు విస్మయాన్ని కలిగిస్తున్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నందున అధికార యంత్రాంగానికే సర్వాధికారాలు కట్టబెట్టేలా ముఖ్య మంత్రి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ !
ప్రభుత్వం బహిరంగంగా చెప్పడం లేదు కానీ అధికార పార్టీకి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు న్నట్లు అధినేత కేసీఆర్ సీక్రెట్ సర్వేలో తేలిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇతరత్రా ప్రయోజనాలు పేదలకు సకాలంలో అందాలన్న సంకల్పంతో ముఖ్య మంత్రి స్వయం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పారదర్శకంగా చేయా ల్సిన పనిని కూడా విపక్షాలు రాజకీయం చేస్తూ, ఓట్ల కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని నిలువరించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరిగా మారిందని చెబుతున్నారు. కేసీఆర్ నిర్ణయం అధికారికం కాకపోవడంతో ఎమ్మెల్యేలు నోరు మెదపలేకపోతున్నారు.